నుపుర్‌ శర్మపై లుక్‌ఔట్‌ నోటీసులు

నుపుర్‌ శర్మపై లుక్‌ఔట్‌ నోటీసులు

కోల్‌కతా : బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్‌ శర్మపై కోల్‌కతా పోలీసులు శనివారం (జులై 2న) లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. అమ్‌హెరెస్ట్‌, నార్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్ల ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో నుపుర్ శర్మను కోరారు. అయితే.. ఇప్పటికే 4 సార్లు పోలీసులు నోటీసులు పంపితే ఆమె హాజరుకాకపోవడంతో తాజాగా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. కోల్‌కతాకు వస్తే తనపై దాడి జరిగే అవకాశం ఉందని, తనకు మరి కొంత సమయం కావాలని నుపుర్ శర్మ కోరింది. మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించి, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించిన నేపథ్యంలో లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ముప్పు పొంచి ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్‌ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేసు పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల అనంతరం దేశంలో జరుగుతున్న ఘటనలకు నుపుర్ బాధ్యురాలని మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇటీవల ఓ టీవీ చర్చలో మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో బీజేపీ అధిష్ఠానం నుపుర్‌తో పాటు మరో నేత నవీన్‌ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.