జల్‌‌.. జంగిల్‌‌.. జమీన్‌‌..కోసం ఉద్యమించిన యోధుడు

జల్‌‌.. జంగిల్‌‌.. జమీన్‌‌..కోసం ఉద్యమించిన యోధుడు

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజనులపై నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అడవి బిడ్డల స్వాతంత్య్రం కోసం పోరాడి అమరుడైన ధీరుడు కుమ్రంభీం. జల్‌‌.. జంగిల్‌‌.. జమీన్‌‌.. నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం తుది వరకు నిలబడ్డ యోధుడు. 1901 అక్టోబర్ 22న పుట్టిండు భీం. అడవి బిడ్డలపై నిజాం సర్కారు అణచివేత, అకృత్యాలను కళ్లారా చూసి ఆవేశానికి గురయ్యేవాడు.ఈ క్రమంలో భీం తండ్రి చిన్ను విషజ్వరం బారినపడి చనిపోయాక.. అన్నలు సోము, బొజ్జు, చిన్నాయనలు కుర్దు, యేసుతో కలిసి, సంకెపల్లి వీడి సుర్దాపూర్ అనే గూడేనికి చేరుకున్నాడు. అక్కడి వారంతా అడవిని నరికి సేద్యం చేశారు. పంట పండినాక సిద్దిక్ అనే జాగీర్దార్ వచ్చి, సుర్దాపూర్ భూములన్నీ తనవే అని వాదించాడు. గొడవ పెట్టుకోవడంతో అక్కడున్న భీం.. సిద్దిక్‌‌ను హత్య చేసి పారిపోయాడు. బలార్షా మీదుగా చాందా వెళ్లగా.. అక్కడ విఠోబా అనే ఉద్యమకారుడు ఆశ్రయమిచ్చాడు. ఆయన ప్రెస్‌‌లో కొంతకాలం పనిచేశాడు. విఠోబాను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడి నుంచి అస్సాం వెళ్లి, తేయాకు తోటల్లో ఐదేండ్ల పాటు కూలీగా పనిచేశాడు. ఇక్కడే ఉర్దూతో పాలు పలు భాషలు నేర్చుకున్నాడు. ఓ వ్యక్తి ద్వారా అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్నెం పోరాటం గురించి తెలుసుకుని ఉత్తేజం పొందాడు. తేయాకు తోటల్లో జరిగిన తిరుగుబాటులో పాల్గొనడంతో బ్రిటీషు వారు నిర్బంధించారు. అక్కడి నుంచి తప్పించుకుని, మళ్లీ చందా మీదుగా కాకన్‌‌ఘాట్ చేరుకున్నాడు.

పట్టాలిచ్చుడు కాదు..

బాబేఝరీ కేంద్రంగా అడవి నరికి 12 గ్రామాలు ఏర్పాటు చేశాడు కుమ్రం భీం. నిజాం సర్కారు ఆ గూడేలను తగులబెట్టి, పంటలు నాశనం చేసి, కేసులు పెట్టింది. వారంతా భీంను ఆశ్రయించారు. భీం నిజాంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ రాజు దర్శనం దొరక్కపోవడంతో వెనుదిరిగాడు. ఈ లోపే జంగ్లాతువాళ్లు 12 గ్రామాలపై విరుచుకుపడ్డారు. కోపోద్రిక్తుడైన భీం.. గోండుల సాయంతో జోడేఘాట్‌‌లో అటవీ అధికారులపై తిరగబడి తరిమికొట్టాడు. అలా భూమి సమస్య కాస్తా ప్రభుత్వానికి, గిరిజనులకు మధ్య యుద్ధంగా మారింది. చివరి ప్రయత్నంగా ప్రభుత్వం.. సబ్ కలెక్టర్‌‌ను చర్చలకు జోడేఘాట్ పంపింది. అక్కడ 12 గ్రామాలకు పట్టాలు ఇస్తామని, అప్పులన్నీ మాఫీ చేయిస్తామని కలెక్టర్ ప్రతిపాదించాడు. కానీ కుమ్రం భీం ఆ 12 గ్రామాల మీద రాజ్యాధికారం డిమాండ్ చేశాడు. చర్చలు విఫలం కావడంతో ఇరుపక్షాలు జోడేఘాట్ కొండల్లో ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. 1940లో దాదాపు ఏడు నెలల పాటు నిజాం సైన్యానికి, భీం అనుచరులకు మధ్య యుద్ధం జరిగింది. చివరికి నైజాం సర్కారు, భారీ మందుగుండు సామగ్రితో 300కి పైగా సైనికులను జోడేఘాట్ పంపింది. అక్టోబర్ 15న 5 గంటలపాటు జరిగిన భీకర యుద్ధంలో భీం, అతడి అనుచరులు నిజాం సైనికుల చేతుల్లో నేలకొరిగారు. భీం చనిపోవడంతో 12 గ్రామాల ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఆయన ప్రాణాలర్పించి 76 ఏండ్లు గడుస్తున్నా.. జల్, జంగిల్, జమీన్‌‌పై హక్కుల కోసం అడవి బిడ్డలు ఇంకో పోరాడుతూనే ఉండటం గమనార్హం.