మరోసారి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ సారీ

మరోసారి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ సారీ

తెలంగాణ కాంగ్రెస్ లో క్షమాపణల పర్వం కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేత  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన వెంటనే.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా సారీ చెప్పారు. చండూరు బహిరంగ సభలో తాను మాట్లాడిన అభ్యంతరకర మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘నా నోటి నుంచి మరో సారి ఇలాంటి మాటలు రావు’ అని ఆయన హామీ ఇచ్చారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఈ క్షమాపణలు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే క్షమాపణలపై ఆలోచిస్తానని వెంకట్ రెడ్డి అంటున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణ 

అంతకుముందు ఇవాళ ఉదయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చేప్పారు. చండూర్ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. హోంగార్డు ప్రస్తావనపై కూడా వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ‘‘ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదు.. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేస్తున్నాను’’ అని ఆయన వెల్లడించారు.