తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరు

తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరు

మునుగోడు నియోజకవర్గంలో తనపై వెలిసిన పోస్టర్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పోస్టర్లలో చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను వ్యాపారాల్లో సంపాదించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించలేదని చెప్పారు. ప్రాణం పోయినా తప్పుచేయనన్న ఆయన.. ఒకవేళ తప్పుచేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తనపై వెలసిన పోస్టర్లపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరని చెప్పారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో జరిగే అమిత్ షా మీటింగ్లో ఎలాంటి మార్పులేదని, మునుగోడు గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పారు. 

మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వ్యక్తిగతంగా దూషించే విధంగా ఉన్న ఈ పోస్టర్లు చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో కనిపించాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. కాంట్రాక్టుల కోసం అమ్ముకున్న వ్యక్తి అని పేర్కొంటూ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లు ఎవరు వేశారన్నది తెలియడం లేదు. అయితే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన పోస్టర్లపై ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పనేనంటూ మండిపడుతున్నారు.