కోట్లు కుమ్మరించి గెలవాలని చూస్తున్నరు

కోట్లు కుమ్మరించి గెలవాలని చూస్తున్నరు

రాష్ట్రంలో కుటుంబ పాలన, అరాచక పాలన పోవాలటే మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర లో నిలిచిపోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు లో జరుగుతున్న పోరు పార్టీల మధ్య కాదు అవినీతి పాలనపై,కేసీఆర్ అరాచకాలపై జరుగుతున్న ఉప ఎన్నిక అని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందిస్తుందన్నారు. తన రాజీనామా తర్వాత పెన్షన్ లు ఇస్తున్నారన్నారు. చేనేత కార్మికుల కష్టాలపై తాను గళం విప్పాక ప్రత్యేక పథకం పెట్టారని తెలిపారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవగానే కేసీఆర్ సర్కార్ గట్టుప్పల్ మండలం ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. తన రాజీనామాతో ఇప్పుడు  ఒక్కో గ్రామపంచాయతీకి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యే కు సీఎం ఆపాయిట్మెంట్ ఇవ్వరు. కానీ ఉపఎన్నికలు వస్తే కోట్లు కుమ్మరించి గెలవాలని చూస్తారని మండిపడ్డారు. మునుగోడులో ఉప ఎన్నికలు రావడంతోనే ఈనెల 20 న సీఎం సభ పేరుతో కేసీఆర్ మునుగోడు కి వస్తున్నారన్నారు. 

చౌటుప్పల్ నుండి పుట్టపాక వరకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ఇప్పుడు 5 కోట్ల నిధులతో ఆగమేఘాల మీద హడావుడిగా రోడ్లు వేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం అభివృద్ధి కోసం ఫండ్ ఇవ్వదని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ ని పట్టించుకోని ప్రభుత్వం ఉప ఎన్నికలు వచ్చే సరకి వారిని విధుల్లో తీసుకుంటుందన్నారు. రాజగోపాల్ రెడ్డి గురించి ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మరన్నారు. రాజకీయాలకు వచ్చి డబ్బులు ఖర్చు చేస్తున్నా కానీ సంపాదించడం లేదన్నారు. డబ్బుల కోసం అయితే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు TRS కి పోతే ఆ టైం లో తాను జంప్ అయ్యేవాడినని చెప్పారు. తాను అలా చేయలేదని..తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజలకోసం ఏ త్యాగానికి అయినా సిద్ధమన్నారు. మిషన్ భగీరథ వాటర్ పేరుతో కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు తాగునీరు ఇవ్వలేదన్నారు. శివన్నగూడ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి సోయి లేదని.. 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదన్నారు. 

రాజకీయాల్లో తన ఎదుగుదలను ఓర్వలేక కాంట్రాక్ట్ ల కోసం బీజేపీలోకి జాయిన్ అయ్యారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. రైతుబంధు కౌలు రైతులకు ఇవ్వాలన్నారు.రుణమాఫీ పేరుతో అన్నదాతలను కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం CLP దళితుడు ఉంటే ఓర్వలేకపోయిందన్నారు. అధికారం కోసం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలుకావాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.