ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం

ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం

కుల్కచర్ల గురుకులంలో అంతా బాగానే ఉందని..కావాలనే కొందరు పనిగట్టుకుని ఇదంతా చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరిగి సెగ్మెంట్ లోని కుల్కచర్ల ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో కలుషిత నీరు తాగి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ తో హాస్టల్ ను గురువారం ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వానాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు జనరల్ గా అన్ని ఊర్లో వస్తాయని తెలిపారు. మాములు జ్వరం కూడా లేదని, అందరూ పిల్లలు బాగానే ఉన్నారని వెల్లడించారు. మిషన్ భగీరథ నుంచి కొత్తగా పైపు లైన్ ఇచ్చామన్నారు. పిల్లలు, సిబ్బందితో మాట్లాడినట్లు, ఏమి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విద్యార్థి మీద లక్ష రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. 

సమస్యలే లేవనడం సరికాదని ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఓ రూంలో కూర్చొని ఎమ్మెల్యే మాట్లాడి వస్తే.. సమస్యలు ఏమి తెలుస్తాయని నిలదీస్తున్నారు. పరిగిలో ఎమ్మెల్యే ఉన్నా లేనట్లేనని..సంక్షేమ గురుకుల పాఠశాలలపై ఆయనకు ప్రేమ లేదని విమర్శించారు. ట్యాబెట్లు ఇచ్చినా.. తక్కువ కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బోరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని, ఇక్కడ ఫిల్టర్ సౌకర్యం లేదన్నారు. పురుగుల నీళ్లు తాగుతున్నట్లు.. 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. పాఠశాల ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించారు. నీటి కాలుష్యం, వాతావరణ ప్రభావంతో జ్వరం, జలుబు, దగ్గు, ఒంటినొప్పులతో విద్యార్థులు బాధ పడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. 200 మందికి పైగా విద్యార్థులకు టెస్టులు చేస్తే.. వంద మందికి ఈ లక్షణాలున్నట్లు తెలిపారు. టైఫాయిడ్ లక్షణాలు కూడా ఉన్నాయన్నారు.