టీడీపీతో కోటంరెడ్డి చేతులు కలిపాడు : అంబటి రాంబాబు

టీడీపీతో కోటంరెడ్డి చేతులు కలిపాడు : అంబటి రాంబాబు

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సభను అడ్డుకునేందుకే కోటంరెడ్డి వచ్చారని విమర్శించారు. ‘కోటంరెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా? ఆయనో నమ్మక ద్రోహి. చంద్రబాబు, టీడీపీ కోసం కోటం రెడ్డి పనిచేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. 

టీడీపీతో కోటంరెడ్డి చేతులు కలిపారని మండిపడ్డారు. కోటంరెడ్డి విలువలు లేని వ్యక్తి అని, దురుద్దేశంతోనే అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారని  విమర్శించారు. చంద్రబాబు మెప్పు కోసమే మాట్లాడుతున్నారని, నమ్మక ద్రోహం చేసిన వాళ్లకి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. అంతకుముందు ఇవాళ ఉదయం అసెంబ్లీలో సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఆయన  నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి తన స్థానంలో ప్లకార్డుతో నిలబడ్డారు. 

క్వశ్చన్ అవర్‌లో సభ్యులు మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. శ్రీధర్ రెడ్డి నిరసనను ప్రభుత్వం, తాను గుర్తించామని స్పీకర్ అన్నారు. దీంతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చే వరకు అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానని, తన నిరసనను ప్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.