రోడ్లపై వరద నీళ్లు నిల్వకుండా చూడాలి : కూనంనేని సాంబశివరావు

రోడ్లపై వరద నీళ్లు నిల్వకుండా చూడాలి : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చుంచుపల్లి మండలం, కొత్తగూడెం పట్టణంలోని  మెయిన్​ రోడ్లపై వరదతో పాటు డ్రైనేజీ నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులకు సూచించారు. మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్​కాలనీ, కొత్తగూడెం పట్టణంలోని సెయింట్​ జోసెఫ్​ స్కూల్​ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పలు సూచనలు చేశారు. 

పట్టణంలోని ముర్రెడు వాగుపై బ్రిడ్జి నిర్మించిన అధికారులు సర్వీస్ ​రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్​రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  

ఎమ్మెల్యేకు సన్మానం.. 

పాల్వంచ : పట్టణంలోని వైద్య విధాన పరిషత్ అనుబంధ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ప్రభుత్వం ఐదు యూనిట్లతో డయాలసిస్ సెంటర్ మంజూరు చేసిన నేపథ్యంలో పాల్వంచ ప్రభుత్వ వైద్యులు కొత్త గూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారి డాక్టర్ ఎం.ముక్కంటేశ్వరరావు, సోమరాజు దొర, తదితరులు ఎమ్మెల్యేతో కలిసి మిఠాయిలు పంచారు.