
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కొడుకు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఆయననుకొత్తగూడెం పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు గురువారం సాయంత్రం నుంచి వార్తలు వచ్చాయి. అయితే దీనిని పోలీసు అధికారులెవరూ ధ్రువీకరించలేదు.
మరోవైపు రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కాసేపటి క్రితమే ఆయన బహిరంగ లేఖ రాశారు. రాఘవపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణకు అయినా సహకరిస్తామని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. ఈ క్రమంలో వనమా రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తమ ఆత్మహత్యకు వనమా రాఘవ కారణమని రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు సెల్ఫీ వీడియో తీసుకుని, అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. దీంతో రామకృష్ణ, అతడి కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన టీఆర్ఎస్ లీడర్ వనమా రాఘవ పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వనమా రాఘవపై 302,306,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడి కోసం తీవ్రంగా గాలించారు పోలీసులు. తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం వనమాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
పోలీసుల విచారణకు రాఘవను అప్పగిస్తా
ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి