ప్రైవేటు కంపెనీలకు హెల్ప్​​ ప్యాకేజీ ఇవ్వం: కేంద్రం

ప్రైవేటు కంపెనీలకు హెల్ప్​​ ప్యాకేజీ ఇవ్వం: కేంద్రం

ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నదని ఆర్థికవేత్తలు, కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రోత్సాహక ప్యాకేజీ (స్టిములస్‌‌‌‌) ప్రకటించబోమని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌‌‌‌ గురువారం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టం జరిగినా పర్లేదు కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం లాభాల్లో ఉండాలనే ఆర్థిక సిద్ధాంతం మంచిది కాదని అన్నారు. ఎదుగుదల, పతనం..కంపెనీలకు మామూలేనని, పతనదశలో పరిశ్రమకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయడం నైతికంగా సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన హీరో మైండ్‌‌‌‌మైన్‌‌‌‌ సమ్మిట్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సగటు వృద్ధి 2–2.4 శాతం కాగా, ఇండియా పరిస్థితి ఇప్పటికీ బాగానే ఉందని సీఈఏ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఆర్థిక నిపుణులు కృష్ణమూర్తి వాదనతో ఏకీభవించారు. ప్రతి పరిస్థితికీ ‘ఆర్థికమాంద్యం’ అనే పదాన్ని వాడుతున్నారని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అదుపులోనే ఉందని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా కలిగే లాభనష్టాలను అంచనా వేశాకే ప్యాకేజీ గురించి చర్చలు మొదలుపెట్టాలని సూచించారు.

‘అతి’ అసలే వద్దు..

అతి నిరాశవాదంతోపాటు అతి ఆశావాదమూ మంచిది కాదని కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుత సమస్యకు విరుగుడు గురించి అందరం ఆలోచించాలని అన్నారు. ఆటోమొబైల్‌‌‌‌ రంగంలో అమ్మకాలు తగ్గడం ఆర్థికమాంద్యానికి సంకేతం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మాంద్యం లేదని ఆర్థిక వ్యవహారాలశాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌‌‌‌ చంద్ర గర్గ్‌‌‌‌ సైతం అన్నారు. అంతర్జాతీయ వృద్ధి గతం కంటే ఇప్పుడు బాగుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని బూతద్దంలో పెట్టి చూడొద్దని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌‌‌‌లో అన్ని కంపెనీలు మంచి లాభాలు సంపాదించాయని, పన్నులు కూడా బాగా వసూలయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది ఎన్నికల వల్ల ఆర్థిక వ్యవస్థ కొద్దిగా నెమ్మదించినట్టు కనిపిస్తోందని తెలిపారు. జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో ఫలితాలు కొద్దిగా నిరాశపూరితంగానే ఉంటాయని గర్గ్‌‌‌‌ అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ ప్రకటిస్తే, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఆర్‌‌‌‌బీఐ రెపోరేట్ల తగ్గింపు ప్రభావం కూడా శూన్యమవుతుందని చెప్పారు.