వైజాగ్​లో కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయలేం

వైజాగ్​లో కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయలేం
  •  కేంద్రానికి తెలిపిన కృష్ణా బోర్డు

హైదరాబాద్, వెలుగు : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) హెడ్ క్వార్టర్స్​ను వైజాగ్​లో  ఏర్పాటు చేయలేమని కేంద్ర జలశక్తి శాఖకు బోర్డు చైర్మన్ శివ్ నందన్ కుమార్ తెలిపారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బోర్డును వైజాగ్​లో ఏర్పాటు చేస్తే తలెత్తే సమస్యలను చైర్మన్ వివరించారు. తెలంగాణ, ఏపీకి ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జున సాగర్ నుంచి వైజాగ్ 500 కి.మీ.ల దూరంలో, శ్రీశైలం నుంచి 650 కి.మీ.ల దూరంలో ఉంటుందని తెలిపారు.

ఆయా ప్రాజెక్టుల నిర్వహణను బోర్డు పర్యవేక్షించాల్సి ఉంటుందని, అంత దూరం నుంచి నిర్వహణ సాధ్యం కాదని వెల్లడించారు.  వైజాగ్​కు బదులు విజయవాడలో ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ - 2014 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. గోదావరి బోర్డు హెడ్ క్వార్టర్స్ తెలంగాణలో, కృష్ణా బోర్డు హెడ్ క్వార్టర్స్ ఏపీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకు  హైదరాబాద్ పదేండ్ల పాటు ఉమ్మడి రాజధాని కావడం, ఏపీలో కొత్త రాజధాని ఏర్పాటు కాకపోవడంతో తాత్కాలికంగా కృష్ణా బోర్డును హైదరాబాద్​లోనే ఏర్పాటు చేశారు.

2021లో నిర్వహించిన రెండో అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ ఏపీకి తరలించాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు వైజాగ్​లో ఆఫీస్ సమకూర్చుతామని తెలిపింది. వైజాగ్ దూరంగా ఉండటంతో ఆ ప్రతిపాదన విరమించుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని కోరాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని కోరారు. బోర్డు తాజా ప్రతిపాదనతో కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ తరలింపు మరింత ఆలస్యం కానుంది.