పెట్టుబడి ఖర్చు తగ్గించే ‘ఎలక్ట్రిక్ బుల్’

పెట్టుబడి ఖర్చు తగ్గించే ‘ఎలక్ట్రిక్ బుల్’

ఇంజినీరింగ్ చదివి మంచి జాబ్ తెచ్చుకున్నారు. అందరిలా తమ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కెరీర్ కోసమే కాకుండా తమ ఊరి రైతుల కోసం కూడా ఉపయోగించారు వీళ్లు. లాక్​డౌన్​లో సొంతూరుకి వెళ్లిన వీళ్లు అక్కడి రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా ‘ఎలక్ట్రిక్ బుల్’ మెషిన్​ తయారుచేశారు. దీన్ని ఎక్కువ మంది రైతులకు అమ్మడానికి ‘కృషిగతి ప్రైవేట్ లిమిటెడ్’ అనే స్టార్టప్ కూడా పెట్టిన తుకారం సోనవానే, సోనాలి వెల్జాలి  గురించి...

తుకారాం మెకానికల్ ఇంజనీర్​. సోనాలి ఇండస్ట్రియల్ ఇంజనీర్. ఇద్దరూ పూనేలో సాఫ్ట్​వేర్ జాబ్ చేస్తున్నారు. పండుగలు, ఫంక్షన్లకు మాత్రమే ఊరికి వెళ్లేవాళ్లు. అయితే లాక్​డౌన్​లో వర్క్​ఫ్రమ్​హోమ్​ ఇవ్వడంతో సొంతూరు అండర్​సూల్​కి​ వెళ్లారు. తమ ఊరి  రైతులు ఇప్పటికీ పొలం పనులకు కర్ర నాగళ్లు వాడడం, కూలీల మీద ఆధారపడడం చూశాడు తుకారం. ఒక్కోసారి కూలీలు దొరక్క ఒక వారం ఆలస్యం అయినా  పంట టైంకి చేతికొచ్చేది కాదు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు వీళ్లు.   

మొదట డీజిల్ ఇంజిన్ మెషిన్ 

‘ట్రాక్టర్లతో దున్నడం వల్ల సాలు సాలుకి మధ్య దూరం ఎక్కువ వస్తుంది. అదే కర్రనాగలి వాడితే తక్కువ దూరంలో సాలు వస్తుంది. దాంతో ఎక్కువ విత్తనాలు నాటే అవకాశం ఉంటుంది. అంతేకాదు మొక్కలు ఎత్తు పెరిగాక మెషిన్లతో పెస్టిసైడ్స్​ కొట్టడం, కలుపు తీయడం సాధ్యంకాదు’ అని చెప్పారు రైతులు. వాళ్ల మాటలు విన్నాక తుకారం, సోనాలికి ఎలాంటి మెషిన్​ అవసరమో అర్థమైంది. ఒక ఫ్రెండ్ ఫ్యాబ్రికేషన్ షాపులో పాత ఇంజిన్​, పనికిరాని వస్తువులతో డీజిల్ ఇంజిన్​తో నడిచే మెషిన్ తయారు చేశారు.  దీని ధర రూ.2,75,000/-–

కరెంట్​ ఇంజిన్​గా...

పూనేలోని ‘సెంటర్ ఆఫ్​ ఎక్సలెన్స్​ మోషన్’లో తాము తయారుచేసిన మెషిన్​ని ఎగ్జిబిషన్​కి పెట్టారు తుకారం, సోనాలి. ఈ సంస్థ కొత్త వ్యవసాయ మెషిన్లు తయారుచేసే స్టార్టప్​లని ఎంకరేజ్​ చేస్తుంది. అక్కడి ఆఫీసర్లు దీన్ని ఎలక్ట్రిక్ ఇంజిన్​గా మార్చండని చెప్పారు. దాంతో  బ్యాటరీ పెట్టి ‘ఎలక్ట్రిక్ బుల్’ని తెచ్చారు. ‘కృషిగతి ప్రైవేట్ లిమిటెడ్’ స్టార్టప్​ కూడా పెట్టారు. ఈ మెషిన్​ని ఒక్కరే  ఆపరేట్ చేయొచ్చు. రెండు గంటలు ఛార్జింగ్ పెట్టాలి. ఫుల్ ఛార్జింగ్ చేస్తే నాలుగ్గంటలు పనిచేస్తుంది. విత్తనాలు చల్లిన తర్వాత..  పంటలో కలుపు తీయడం నుంచి పంట నూర్చడం వరకు అన్ని పనులు ఈ మెషిన్​తో చేసుకోవచ్చు.