ప్లానింగ్ లేకపోవడమే ట్రాఫిక్ కు కారణం

ప్లానింగ్ లేకపోవడమే ట్రాఫిక్ కు కారణం

నగరాల్లో అత్యంత సాధారణంగా కనిపించే అతి తీవ్ర సమస్య ట్రాఫిక్. ఇరుకు దారులు, రూల్స్​ బ్రేక్​ చేసేవాళ్లు, అడ్డదిడ్డంగా చేసే పార్కింగ్​ వంటివి ట్రాఫిక్​ కష్టాలు పెంచుతాయి. అయితే, ఇలాంటివాటన్నింటికీ మూలకారణం మాత్రం రవాణాశాఖ ఇంజినీర్లే అంటున్నాడు అలెగ్జాండర్​ క్రిలటోవ్! రష్యాలోని సెయింట్​ పీటర్స్​బర్గ్​ యూనివర్సిటీలో లెక్కల​ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడు ఈయన.

ట్రాఫిక్​ సమస్యకు ముఖ్య కారణం ఇంజినీర్లకు ప్లానింగ్​ లేకపోవడమే అంటున్నాడు క్రిలటోవ్​. ‘‘ఎక్కడైనా ఒకచోట ట్రాఫిక్​ ఇబ్బంది తప్పించినప్పటికీ అది తాత్కాలికమే. ఆ సమస్య మరో దగ్గర తలెత్తుతుంది. దీనికి కారణం ప్లానింగ్​ సరిగా లేకపోవడమే. ఆ సమస్య నుంచి బయటపడాలంటే గణితం సాయపడుతుంది” అంటున్నాడు ఆయన. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నాడు. ఒకే నేవిగేషన్​ సిస్టమ్ ఉపయోగించడం. అంటే వేర్వేరు నేవిగేషన్​ సెంటర్ల నుంచి వచ్చే సూచనలు కాకుండా ఏదైనా ఒకే హబ్​ నుంచి వ్చే వాటినే డ్రైవర్లు ఫాలో కావాలి. చాలా నగరాల్లో దారులు మరీ ఇరుకుగా ఉంటాయి. వాటిని విస్తరించడం కుదరదు. ఇలాంటి రోడ్లలో అక్కడక్కడా కనిపించే పార్కింగ్ ప్లేస్​లను తీసేసి వాటిని లేన్లుగా మార్చాలి. 

విద్యుత్​తో నడిచే వెహికల్స్​కు ప్రత్యేక మార్గం(గ్రీన్​ లేన్స్​) కేటాయించాలి. ఇలా చేయడం వల్ల ఆ వెహికల్స్​ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ పెరిగినా దానికి తగ్గట్టు సౌకర్యాలు లేనప్పడు డిజిటల్ మోడలింగ్​ పద్ధతి ద్వారా వాటిని సమన్వయం చేయొచ్చు. ఈ సాఫ్ట్​వేర్​ రవాణాశాఖ ఇంజినీర్లకు ఉపయోగపడుతుంది. నిజానికి ట్రాఫిక్​ మోడలింగ్​ అనేది సంక్లిష్ట ప్రక్రియ. దీన్ని పెట్టినా డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వెహికల్స్​ నడిపితే ప్రయోజనం శూన్యం. అయితే, ‘ప్రతి సంవత్సరం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి. వాటిని సమర్థంగా వాడుకోవడంలో మేం చెప్పిన పద్ధతులు కొంతమేర ఉపయోగపడొచ్చు’ అంటున్నాడు అలెగ్జాండర్​ క్రిలటోవ్​. ఈ పద్ధతేదో బాగుంటుంది అనుకుంటే.. మన దగ్గరా వాడితే బాగుంటుంది కదా.