హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం (నవంబర్ 1) ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు గర్జన సభా నిర్వహించింది. కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట అరచేతిలో వైకుంఠ చూపించారు. కానీ అధికారంలోకి వచ్చాక రైతు బంధు, రైతు బీమా ఎగ్గొట్టారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ ఉంటే ఎగ్గొట్టిన మూడు రైతుబంధులతో పాటు యాసంగి రైతుబంధు కలిసి ఎకరానికి రూ.60 వేలు వెయ్యాలని డిమాండ్ చేశారు. అలానే కౌలు రైతులకు కూడా ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు సీజన్ల రైతుబంధు డబ్బులు వెయ్యాలన్నారు. భూమి లేని రైతు కూలీలకు నెలకు రూ.1000 వేస్తామని అన్నారు. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. రైతు కూలీలకు వెంటనే నెలకు వెయి రూపాయల చొప్పను 36 నెలలకు గానూ రూ.36 వేలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రైతుబందు ఆపేశారు. రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం ప్రతినెలా ఈఎంఐ పడుతోంది. రాహుల్కు ఈఎంఐ కట్టకపోతే రేవంత్ రెడ్డి పదవి రెన్యువల్ కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలు అని.. ఇద్దరూ కలిసే దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ మోసం చేశారని విమర్శించారు.
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తాను గెలిస్తే సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని అన్నాడు. కానీ సిమెంట్ ఫ్యాక్టరీని తెరవకుండా తుక్కు కింద అమ్మేస్తున్నారు. ఈ బీజేపీ వాళ్లది అయితే జుమ్లా లేదా హమ్లా అని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే ఈ 13 ఏళ్లలో రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. మోడీ 13 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మోసగాళ్ల ఉచ్చులో పడి ప్రజలు మోసపోయారన్నారు. బడేబాయ్, చోటా భాయ్ ఇద్దరు జూటే మనుషులేనని ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు.
