మోదీకి పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదు : కేటీఆర్

మోదీకి పాలమూరులో  అడుగుపెట్టే అర్హత లేదు : కేటీఆర్
  • రాష్ట్రంపై ప్రతిసారి విషం చిమ్ముతున్నరు: కేటీఆర్
  • గవర్నర్ బీజేపీ లీడర్​గానే వ్యవహరిస్తున్నరు
  • గవర్నర్​గా తమిళిసై ఫిట్​ అయినప్పుడు.. 
  • మా లీడర్లు ఎమ్మెల్సీలుగా ఎందుకు ఫిట్​ కారు?
  • కిషన్​రెడ్డి.. మోస్ట్​ అన్​ఫిట్​ సెంట్రల్​ మినిస్టర్​
  • చంద్రబాబు అరెస్టుపై ఇక్కడ ఆందోళనలు ఏంది?
  • ఏపీ రాజకీయాలతో తెలంగాణకేం సంబంధం?
  • తనకు లోకేశ్​, జగన్​, పవన్​ దోస్తులేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని మోదీకి పాలమూరులో అడుగు పెట్టే అర్హత లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణపై ప్రతిసారి విషం చిమ్ముతున్నారని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ గడ్డపై  అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘మోదీ వాచాలత, దిక్కుమాలిన తనం వల్ల తెలంగాణ ప్రజల శాపంతో   2014, 2018లో బీజేపీకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్లీ అదే గతి పడుతుంది” అని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్​లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 

2014 ఎన్నికల ప్రచార సభలో పాలమూరు -–- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అనుమతులు కూడా ఇవ్వడం లేదని,  కృష్ణా జలాల్లో వాటానూ తేల్చడం లేదని అన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడంతో పాటు, పాలమూరు  ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మోదీ పాప ప్రక్షాళన చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ, అవినీతి ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదిన్నరేండ్ల తర్వాత కూడా కొందరికి పాత అలవాట్లు పోవడం లేదు.  

ఎన్డీయే డీఎన్ఏలోనే నరనరానా విషం చిమ్మే అలవాటు ఉంది” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరుపుకున్నామని, అలాంటప్పుడు రాష్ట్ర ఉత్సవాలు జరగలేదని మోదీ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను ప్రధాని అపహాస్యం చేశారని మండిపడ్డారు. కిషన్​రెడ్డి మోస్ట్ అన్​ఫిట్ సెంట్రల్ మినిస్టర్ అని, సొంత నియోజకవర్గంలో ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని అసమర్థుడని ఆయన దుయ్యబట్టారు. 

ఎవరు ఫిట్టో.. ఎవరు అన్​ఫిట్టో ప్రజలే తేలుస్తరు

రాజకీయాల్లో ఎవరు ఫిట్​.. ఎవరు అన్​ఫిట్​అనేది ప్రజలే తేలుస్తారని కేటీఆర్​అన్నారు. గవర్నర్​కోటాలో నామినేట్​చేసిన కుర్రా సత్యనారాయణ ట్రేడ్​యూనియన్​నుంచి రాజకీయాల్లోకి వచ్చారని, దాసోజు శ్రవణ్​కుమార్​ప్రొఫెసర్​గా పని చేశారని ఆయన తెలిపారు. ‘‘ఎమ్మెల్సీలుగా వారి నియామకానికి గవర్నర్​ ఆమోదం తెలుపుతారని అనుకున్నాం. కానీ గవర్నర్​ వారిద్దరిని అన్​ఫిట్​గా పేర్కొనడం సరికాదు. గవర్నర్​గా నియమాకం అయ్యే ముందు రోజు వరకు తమిళిసై తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారు. 

రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించొద్దని సర్కారియా కమిషన్​తేల్చిచెప్పింది. అలాంటప్పుడు రాజకీయ నాయకురాలైన తమిళిసై గవర్నర్​గా ఎలా ఫిట్​అవుతారు? రాజకీయ నాయకురాలిని గవర్నర్​ను​చేసిన మోదీ ప్రధానిగా ఎట్ల ఫిట్​ అవుతారు? దేశంలో ప్రధాని మోదీ, ఆయన ఏజెంట్లయిన గవర్నర్లు అప్రజాస్వామికంగానే ఉన్నారు” అని దుయ్యబట్టారు. ‘‘గవర్నర్​ ఇప్పుడు కూడా బీజేపీ నాయకురాలిలా వ్యవహరించడం లేదా.. గవర్నర్​తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ఆయన అన్నారు. 

ఎవరినైనా గవర్నర్​ కోటాలో నామినేట్​ చేసే అధికారం కేబినెట్​కు ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనేది ప్రజలు, పార్టీలు ఆలోచించాలని కేటీఆర్​ అన్నారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్​వ్యవస్థను అడ్డుపెట్టుకొని అప్రతిష్ట పాలు చేస్తున్నరు..” అని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​ తమ పార్టీ లీడర్లను నామినేట్​చేసుకుంటూ ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని దుయ్యబట్టారు. 

ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం?

ఐటీ కారిడార్​లో శాంతిభద్రతలే తమకు ముఖ్యమని కేటీఆర్​ అన్నారు. ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు అరెస్టయింది ఏపీలో. ర్యాలీలు, ధర్నాలు చేయదల్చుకుంటే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూల్​లో చేసుకోవాలి. చంద్రబాబు అరెస్టుపై  నిర్మొహమాటంగా ఏపీలో ఆందోళనలు చేసుకోవాలి కానీ హైదరాబాద్​లో శాంతిభద్రతల సమస్య ఎందుకు సృష్టిస్తారు? ఇక్కడ ఒకరు ర్యాలీ చేసిండ్రని తెల్లారి పోటీగా ఇంకొకరు ర్యాలీ చేస్తరు.. మరి మేమేం చేయాలి?” అని మండిపడ్డారు. ‘‘పక్కింట్లో పంచాయితీ ఇక్కడ తేల్చుకుంటామంటే ఎట్లా.. వాళ్లవాళ్ల పంచాయితీకి హైదరాబాద్​లో కొట్లాడుతామంటే.. మేం ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాం.. 

శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఇక్కడి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది” అని ఆయన అన్నారు. వాళ్ల ఘర్షణలకు హైదరాబాద్​ను ఎలా వేదిక కానిస్తామని, అది ఏపీలోని రెండు రాజకీయ పార్టీల తగాదా అని పేర్కొన్నారు.  ‘‘నాకు లోకేశ్, జగన్, పవన్​కళ్యాణ్​అందరూ దోస్తులే.. ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు.. ఇప్పటికప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన పని లేదు. వేరే వాళ్ల ద్వారా ఫోన్​లో లోకేశ్​నాతో మాట్లాడి ర్యాలీలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని అడిగిండు. రేపు ఇలాగే ఇంకొకరు చేస్తే ఏంటని నేను ప్రశ్నించాను. ఐటీ కారిడార్​లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీలు జరగలే.. ఐటీ యాక్టివిటీ దెబ్బతినొద్దని అప్పటి ప్రభుత్వాలు ఎలో చేయలేదు.. అక్కడ వాతావరణం దెబ్బతినొద్దన్నదే మా ప్రభుత్వ లక్ష్యం” అని కేటీఆర్​ చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్​పార్టీ ఎలాంటి స్టాండ్​ప్రకటించలేదని, ఎవరైనా లీడర్లు మాట్లాడితే వాళ్ల సొంత అభిప్రాయమేనని తేల్చిచెప్పారు.