ఫస్టుకు జీతాలియ్యలేదనే.. ఉద్యోగులు మాకు దూరమైన్రు : కేటీఆర్ 

ఫస్టుకు జీతాలియ్యలేదనే.. ఉద్యోగులు మాకు దూరమైన్రు : కేటీఆర్ 
  •     నాలుగు రోజులు జీతాలాపితే యూట్యూబ్​లో రచ్చ చేసిన్రు: కేటీఆర్ 
  •     శాలరీలు 73% పెంచినా.. ఫస్టు తారీఖు జీతాలే మెయిన్ వార్తయింది
  •     ఉద్యోగులకు వేతనాలే ఇస్తలేరన్నట్టు బద్నాం చేసిన్రు  
  •     ఫ్రీ బస్ తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదని కామెంట్

వరంగల్‍/నర్సంపేట, వెలుగు:  ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేదనే ప్రభుత్వ ఉద్యోగులు తమకు దూరమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచినా, ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేదంటూ బద్నాం చేశారన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్ లోని ములుగు, నర్సంపేట, వరంగల్‍ తూర్పు, వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి తరఫున ఆయన ప్రచారం చేశారు. ‘‘దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నరు.

కేసీఆర్‍ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచిన్రు. ఇది ఎక్కడికో పోయింది. కానీ మొదటి తారీఖున జీతాలు పడలేదన్నదే మెయిన్‍ వార్త అయింది. కరోనా తర్వాత రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, పేదవాళ్ల కార్యక్రమాలు ఆగొద్దని కేసీఆర్ భావించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఓ నాలుగు రోజులు జీతాలు లేటైతే ఏమైతదయ్యా? అని ఆపారు. గీమాత్రం దానికే యూట్యూబ్‍లో గోరంతలు కొండంతలు చేసి.. చిలువలు పలువలు చేసి.. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరని చెప్పి బద్నాం చేసి వారు మాకు దూరమైన్రు” అని చెప్పారు. 

ఫ్రీ బస్ తప్ప ఏ హామీ అమలు చేయలే.. 

కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్ జర్నీ తప్పితే మిగతావేవీ అమలు చేయలేదని, కానీ అన్నీ అమలు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. కానీ మే 22 వచ్చినా చేయలేదన్నారు. రూ. 15 వేల రైతు భరోసా, రైతు కూలీలకు రూ. 12 వేల సాయం ఏమైందని ప్రశ్నించారు. వరంగల్ ఎంజీఎంలో ఐదు గంటలు కరెంట్‍ పోయి.. ఉన్న నాలుగు జనరేటర్లు పనిచేయలేదన్నారు. తాము వరంగల్ లో 24 అంతస్తుల సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్‍ నిర్మాణం చేపడితే.. కాంగ్రెస్‍ ప్రభుత్వం వచ్చాక పనులు ఆగాయన్నారు.

తాము వరంగల్‍కు టెక్‍ మహీంద్రా, జెన్‍ప్యాక్ట్ వంటి ఏడెనిమిది కంపెనీలు తెస్తే.. టెక్‍ మహీంద్రా వరంగల్‍ నుంచి వెళ్లిపోవడానికి రెడీగా ఉందన్నారు. జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా మార్చిన రేవంత్‍రెడ్డి.. అందులోని ఓరుగల్లు, చార్మినార్‍, గొల్కొండ చిహ్నాలను రాజముద్రల నుంచి తొలగిస్తామని చెబుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‍రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బండా ప్రకాశ్‍ తదితరులు పాల్గొన్నారు. 

ఓడగొట్టి.. సీఎం అంటరేందిర బై..   

గ్రేటర్‍ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం జరిగిన సమావేశంలో కేటీఆర్ మాటలు అక్కడున్నవారిలో నవ్వులు పూయించాయి. ముందుగా కేటీఆర్ మాట్లాడేందుకు మైక్‍ తీసుకున్నారు. అంతలోనే అక్కడున్న కార్యకర్తలు, యువకులు ‘‘కేటీఆర్‍.. సీఎం.. సీఎం’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్‍ స్పందిస్తూ.. ‘‘అసెంబ్లీ ఎలక్షన్ల ఓడగొట్టి ఇప్పుడు సీఎం.. సీఎం అంటున్నారేందిరా అయ్యా. మా ఎమ్మెల్యేలను హనుమకొండలో ఓడగొట్టింన్రు.. తూర్పులోనూ ఓడగొట్టిన్రు.. ఇప్పుడేమో నన్ను సీఎం.. సీఎం అంటున్నరు. దండం పెడ్తా ఇక ఆపండిరా బై..” అంటూ నవ్వుతూ బదులిచ్చారు.   

కరెంట్ కోతలు, ఎండిన చెరువులు కనిపిస్తున్నయ్

    కాంగ్రెస్ పాలనలో 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు: కేటీఆర్
 
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో పదేండ్లు కనిపించని కరెంట్ కోతలను కాంగ్రెస్ పాలనలో చూస్తున్నమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి, కాలిన మోటార్లు, సాగునీరు లేక ఎండిన పొలాలు, చెరువులు కనపడుతున్నాయని పేర్కొంటూ బుధవారం ట్వీట్ చేశారు. రైతులు రైతుబంధు, రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. లోన్లు కట్టకపోవటంతో బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. జోగిపేటలో విత్తనాల కోసం క్యూలైన్ లో పాస్ బుక్ లు పెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కనిపిస్తున్నాయని..ముందు ముందు ఎన్ని చూడాలో అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.