కూకట్​పల్లిలో పాగా వేసేదెవరు? .. సెటిలర్లు, ముస్లిం మైనారిటీ ఓట్లే కీలకం

కూకట్​పల్లిలో పాగా వేసేదెవరు? .. సెటిలర్లు, ముస్లిం మైనారిటీ ఓట్లే కీలకం

హైదరాబాద్,వెలుగు :  గ్రేటర్​లో సెటిలర్స్​కు అడ్డా కూకట్​పల్లి సెగ్మెంట్. ఎమ్మెల్యే అభ్యర్థుల తలరాతను మార్చేది వీరే. ఇక్కడ వీరి ఓట్లే కీలకం. ఆంధ్ర సెటిలర్లతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా నివసిస్తుంటారు. ముస్లిం మైనారిటీలు, ఆంధ్రాసెటిలర్లు అధికంగా ఉండగా.. వారి ఓట్లను దక్కించుకోవడం అభ్యర్థులకు మస్ట్. సెగ్మెంట్ పరిధిలోని అల్లాపూర్, మూసాపేట, బాలానగర్, ఫతేనగర్ ​డివిజన్లలో ముస్లిం మైనారిటీలు ఎక్కువ. 

కూకట్​పల్లి, భాగ్యలక్ష్మి కాలనీ, వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ తదితర ఏరియాల్లో సెటిలర్లు అధికంగా నివసిస్తుంటారు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది వీరే. సెగ్మెంట్ పరిధిలో మొత్తం 4,47,523 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్​పల్లి నుంచి బీఆర్ఎస్​అభ్యర్థిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కాంగ్రెస్ అభ్యర్థిగా బండి రమేశ్, జనసేన (బీజేపీతో పొత్తు) అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలో నిలిచారు.  ఆయా పార్టీల క్యాండిడేట్లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 

ప్రభుత్వ పథకాలే గెలిపిస్తయనే ధీమా

ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన కొద్దిరోజులకే బీఆర్ఎస్​లో చేరారు. 2018లో బీఆర్ఎస్​నుంచి రెండోసారి విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఆయన పోటీలో నిలిచారు. ఫుల్​టైమ్​ రాజకీయాల్లో ఉండే మాధవరం కృష్ణారావు తన సామాజిక వర్గం ఓటర్లపైనే ఆశలు పెట్టుకోగా.. ఆంధ్రా సెటిలర్లు కూడా తనకే ఓటు వేస్తారనే ధీమాతో ఉన్నారు. 

వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా ఆయనకు పేరుంది. బీఆర్ఎస్​ ప్రభుత్వ పథకాలే మరోసారి గెలిపిస్తాయని భావిస్తున్నారు . అయితే.. సెగ్మెంట్​లో ప్రభుత్వ వ్యతిరేక కూడా ఎక్కువగానే ఉండడంతో ఈసారి ఆయన గెలుపుపై ఆసక్తిగా మారింది. కృష్ణారావు మైనస్​పాయింట్లు చూస్తే..పార్టీ కార్యకర్తల మధ్య కుమ్ములాటలు, ముస్లిం మైనారిటీలు ఎంతమేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పథకాలు అందని వారు కూడా వ్యతిరేకత చూపుతుండగా గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. 

బీఆర్ఎస్ పై వ్యతిరేకతే కలిసొస్తదనే ఆశ

సెగ్మెంట్ లో పాగా వేసేందుకు కాంగ్రెస్​తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పార్టీ అభ్యర్థిగా బండి రమేశ్​పోటీ నిలిచారు. గతంలో ఆయన శేరిలింగంపల్లి నుంచి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అనంతరం ప్రజా రాజ్యంలో చేరి 2009లో శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్​లో చేరి.. టికెట్ ఆశించగా దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్​లో చేరారు. సెటిలర్​నేత కావడమే కాకుండా స్థానికంగా మంచి పలుకుబడి ఉంది. 

తన సామాజిక వర్గమైన కమ్మ ఓట్లు తనకే పడతాయనే ధీమాతో ఉండడంతో పాటు  మిగతా వర్గాల ఓటర్లపైనా ఫోకస్ పెట్టారు. ప్రజల్లో బీఆర్ఎస్​పై పెరుగుతున్న వ్యతిరేకత, కాంగ్రెస్​కు కలిసొస్తున్న ఆదరణ తనకు లాభిస్తుందనే ఆశతో ఉన్నారు. బండి రమేశ్​మైనస్​పాయింట్లను చూస్తే.. వలస నేత వచ్చి పోటీ చేస్తున్నారని పార్టీ స్థానిక నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలు, దళితుల ఓట్లను ఏ విధంగా తనకు అనుకూలంగా మార్చుకుంటారన్నది కూడా ఆసక్తిగానే ఉంది. 

అధినేత ఆకర్షణే గెలుపు మంత్రం

ఇక్కడి నుంచి తొలిసారిగా జనసేన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తెలంగాణలో బీజేపీతో జనసేన  పార్టీ అధినేత పవన్​కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే కూకట్​పల్లి సీటును జనసేనకు   కేటాయించారు. రియల్​ఎస్టేట్​వ్యాపారి అయిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్​రాజకీయాలపై ఆసక్తితో బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి టికెట్ దక్కించుకుని అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కూకట్​పల్లిలో కాపు ఓటర్లు కూడా ఎక్కువగానే ఉండడంతో  అదే సామాజిక వర్గానికి చెందిన ఆయనను జనసేన పోటీలోకి దింపింది. సెగ్మెంట్ నుంచి బీజేపీ నేతలు కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. 

చివరకు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించగా కమలం క్యాడర్​అసంతృప్తితో ఉంది. జనసేన గెలుపునకు బీజేపీ క్యాడర్​ఏ మేరకు పని చేస్తుందనేది చూడాలి. తన గెలుపునకు పార్టీ అధినేత పవన్​కళ్యాణ్​ ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. బీఆర్ఎస్​ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత అనుకూలంగా మారుతుందని ఆయన పేర్కొంటున్నారు. ప్రేమ్ కుమార్ మైనస్​పాయింట్లను చూస్తే..  సెగ్మెంట్ లో జనసేన ఉనికి లేకపోవడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. 

బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేసినా కమలం క్యాడర్ గెలిపించే స్థాయిలో లేదన్న వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్​, కాంగ్రెస్​లను తట్టుకునే శక్తి జనసేనకు లేదనేది చర్చలో ఉంది. అయితే.. జనసేన నుంచి ఆపార్టీ అధినేత పవన్​కళ్యాణ్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరిగినా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.