సాధువులకు మోడీ విజ్ఞప్తి

సాధువులకు మోడీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ రూపంలో తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కుంభమేళాను నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం 30 మంది సాధువులకు వైరస్ పాజిటివ్‌‌గా తేలింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కుంభమేళాను ఘనంగానే జరపాలని సాధువులను కోరారు. ఈ విషయంపై జునా అఖండ మహంత్ అయిన స్వామి అవ్‌‌ధేశ్‌నంద్‌‌ గిరితో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. అక్కడి సాధువుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన మోడీ.. సాధువులకు ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళాను కుదించేలా చూడాలని ఆయనను కోరారు. ఇప్పటికే రెండు రాజ స్నానాలు పూర్తయిన నేపథ్యంలో భక్తులెవరూ లేకుండా లాంఛనప్రాయంగా కుంభమేళాను జరపాలని స్వామి అవ్‌‌ధేశ్‌‌కు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల ఈ విషమ పరిస్థితుల్లో కరోనాపై పోరుకు బలం చేకూరుతుందని మోడీ ట్వీట్ చేశారు.