కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో .. ఏనుగు హల్​చల్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో .. ఏనుగు హల్​చల్
  •   మిర్చీ ఏరుతున్న రైతుపై దాడి.. 
  •     అక్కడికక్కడే  మృతి
  •     ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే  కారణమని గ్రామస్తుల ఫైర్
  •     చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు :  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో ఏనుగు హల్ చల్ చేసింది. మిర్చి పంట ఏరుతున్న రైతుపై దాడి చేసి చంపేసింది. బుధవారం మధ్యాహ్నం భూరేపల్లి – రణవెల్లి గ్రామాల మధ్య ఉన్న చేలల్లో ఏనుగు తిరగడాన్ని రైతులు గమనించారు. స్థానికులు, రైతులు కేకలు వేస్తూ ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బూరుగుపల్లిలోని తన చేనులో భార్య సుగుణతో కలిసి మిర్చి ఏరుతున్న రైతు శంకర్ (55) మీద ఏనుగు దాడి చేసింది. తొండంతో పట్టుకుని.. ఆ పై కాలితో తొక్కడంతో శంకర్ స్పాట్​లోనే చనిపోయాడు.

తన కండ్ల ముందే భర్త చనిపోవడంతో భార్య సుగుణ కన్నీరుమున్నీరైంది. అసలు ఏనుగు ఎలా వచ్చిందో తెలియదని సుగుణ  తెలిపింది. చేనులో మిర్చి ఏరుతున్నప్పుడు తమవైపు పరిగెత్తుకుంటూ వచ్చిందని చెప్పింది. భర్త శంకర్​ను అప్రమత్తం చేసి తాను పక్క చేనులోకి పరిగెత్తుకుంటూ వెళ్లినట్టు తెలిపింది. తన భర్త మాత్రం మిర్చి చెట్ల పొదల్లో దాక్కున్నాడని, ఇంతలోనే ఏనుగు దాడి చేసిందని వివరించింది. అరిచినా, కేకలు పెట్టినా తన భర్తను ఏనుగు వదల్లేదని, కింద వేసి తొక్కేసిందని సుగుణ విలపించింది.  రైతులు వచ్చి ఏనుగును తరిమేశాక తన భర్త వద్దకెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయాడని  గొల్లుమంది. మృతుడికి ఇద్దరు భార్యలు, నలుగురు కూతుళ్లు ఉన్నారు.

ఫారెస్ట్ ఆఫీసర్లు ముందే సమాచాం ఇస్తే బాగుండు : గ్రామస్తులు

ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే ఏనుగు పొలాల్లోకి వచ్చిందని బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగేపల్లి, మెరిపల్లి గ్రామాల శివారులో ఓ ఏనుగు తిరుగుతున్నదని, ప్రాణహిత నది దాటి తెలంగాణ వైపు వచ్చిందని అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ అధికారులు మాత్రం తమకు ఈ విషయం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందే సమాచారం ఇచ్చి ఉంటే తాము అంతా అప్రమత్తంగా ఉండేవాళ్లమన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల వరకు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు స్పందించలేదన్నారు. ఒక బీట్ ఆఫీసర్ తప్ప ఎవరూ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి గురించి అడిగి తెలుసుకోలేదని మండిపడ్డారు. అయితే, సంఘటనా స్థలాన్ని కాళేశ్వరం జోన్ కన్జర్వేటర్ శాంతారామ్, ఆసిఫాబాద్ డీఎఫ్ ఓ నీరజ్ కుమార్, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ సాదిక్ పాషా రాత్రి పరిశీలించారు. ప్రస్తుతం ఏనుగు చింతలమానేపల్లి మండలం కర్జెళ్లి అడవిలో ఉన్నట్లు అధికారులు 
గుర్తించారు.