ఊరుంది.. నీళ్ల కింద

ఊరుంది.. నీళ్ల కింద

గోవాలో ఓ ఊరుంది. ఏడాదిలో ఒక్క నెలే కనబడ్తది. 11 నెలలు గాయబ్‌ అయితది. ఎందుకంటరా? ఆ ఊరు దగ్గరే పెద్ద డ్యాం కట్టారు. డ్యాం నిండగానే నీళ్లొచ్చి ఊరిని ముంచేస్తయ్‌. మే నెలలో నీళ్లు తగ్గగానే ఊరు కనబడ్తది. ఆ ఊరి పేరే కుర్దీ. దక్షిణ గోవాలో సలౌలిమ్‌ నది, పశ్చిమ కనుమల మధ్య ఉంది. ప్రస్తుతం అక్కడెవరూ లేరనుకోండి. డ్యాం కట్టే ముందే అందర్నీ తరలించారు. నీళ్లు తగ్గిపోగానే ఆ ఊరోళ్లు అక్కడకొస్తరు. తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటరు. పండగ చేస్కుంటరు.

దక్షిణ గోవాలో అప్పట్లో జనసంచారమున్న పెద్ద ఊరు కుర్దీ. 3 వేల మంది ఊల్లో ఉండేవారు. హిందువుల, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసిమెలిసి జీవించేవారు. అక్కడి నేల సారవంతమైనది. కొబ్బరి, జీడి, మామిడి చెట్లు పెంచేవారు. ప్రముఖ గాయకురాలు మొగుబాయ్‌ కుర్దికార్‌ పుట్టిన ఊరూ అదే. 1961లో పోర్చుగీసు నుంచి గోవా స్వతంత్రం పొందాక పరిస్థితులు మారిపోయాయి. 1986లో ఆ ఊరోళ్లకు తెలిసింది ఇక ఆ ఊరుండదని. రాష్ట్రంలో తొలి డ్యాంను కట్టేందుకు ఆ ఊరును ఖాళీ చేయించాల్సి వచ్చింది. రాష్ట్ర తొలి సీఎం దయానంద బండోడ్కర్‌ ఆ ఊరెళ్లారు. డ్యాం కడితే దక్షిణ గోవా మొత్తం బాగుపడుతుందని ఊరోళ్లకు వివరించారు. సుమారు 600 కుటుంబాలను పక్కనున్న గ్రామాలకు తరలించారు. ఇళ్లు, భూమికి పరిహారం ఇచ్చారు. సలౌలిమ్‌ నదిపై ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి ప్రాజెక్టుకూ అదే పేరు పెట్టారు. దక్షిణ గోవాలో తాగు, సాగు నీటితో పాటు పరిశ్రమలకు కూడా నీరందించేలా, గోవా ప్రజలకు రోజూ 40 కోట్ల లీటర్ల నీరు అందించేలా ప్రాజెక్టు కట్టారు.

పక్కన డ్యాం ఉన్నా నీళ్లు రావు
ఊరు గురించి గురుచరణ్‌ కుర్దికార్‌ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ‘అప్పుడు నాకు 10 ఏళ్లు. నన్ను, నా తమ్ముడు, మా నానమ్మను త్వరత్వరగా బండెక్కించారు. సామాన్లన్నీ అందులో పెట్టేశారు. మా అమ్మానాన్న మోపెడ్‌లో బండిని అనుసరించారు’ అని చెప్పారు. కుర్దికార్‌ తల్లి మమత మాట్లాడుతూ.. ‘అప్పటికి చాలా మంది ఊరిని ఖాళీ చేశారు. కొన్ని కుటుంబాలే ఉన్నాయి. ఆ రోజు బాగా వర్షం పడింది. పక్కనున్న పొలాల నుంచి భారీగా నీరు ఇళ్లలోకి రావడం మొదలైంది. త్వరత్వరగా బయలుదేరాల్సి వచ్చింది’ అన్నారు. తమకు హామీ ఇచ్చినట్టు ప్రతి గ్రామానికి నల్లా మాత్రం రాలేదని గురుచర్‌ తండ్రి గజానన్‌ చెప్పారు. పక్కన డ్యామున్నా తాగే నీళ్లు మాత్రం తమకు రావన్నారు. ప్రస్తుతం కుర్దికార్‌ ఉంటున్న వడ్డెం ఊళ్లో రెండు పెద్ద బావులున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండిపోతాయి. ప్రభుత్వ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. నీళ్లు తగ్గిపోయాక మే నెలలో ఊరోళ్లు వచ్చి వాళ్ల ఇళ్లను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటారు. ఆ నెలలోనే హిందువులు, క్రిస్టియన్లు అక్కడ పండుగలు చేసుకుంటారు.