తెలంగాణలో కురుమలు ఇంకా మోసపోరు

తెలంగాణలో  కురుమలు ఇంకా మోసపోరు

ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన కురుమలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే  అన్ని వర్గాలతో పాటు కురుమలకు కూడా సంక్షేమ, సామాజిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరుగుతుందని భావించాం! కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వివక్ష తప్పలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో కురుమలు తమ అస్థిత్వాన్ని, ఉనికిని కోల్పోయే పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల జనాభాతో రెండవ స్థానంలో కురుమలు ఉన్నారు. 

యాదవులు, కురుమలు ఒకటి కాదు

యాదవులకు, కురుమలకు వేర్వేరు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల కేటగిరీ పరంగా కురుమలు బీసీ  బీ సీరియల్ ​నంబర్​11లో ఉన్నారు. యాదవులు బీసీ డీ సీరియల్​ నంబర్33లో ఉన్నారు. వేర్వేరు రిజర్వేషన్లు కలిగి ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా కురుమలకు ఏ రంగంలోనూ న్యాయం జరగలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో అన్ని కులాలకు ఇచ్చినట్లే ఆత్మగౌరవ భవనాల పేరిట కురుమలకు 5 ఎకరాల భూమి, 5 కోట్ల రూపాయలు భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చింది. 

ఈ విధంగా కుల సంఘాల నాయకులకు ఆశలు చూపి ఒకరికి ఎమ్​ఎల్​సీ పదవి ఇవ్వగానే కురుమలకు సామాజిక న్యాయం జరిగినట్లా? రాజకీయ వాటా లభించినట్లా? బతుకులు మారినట్లా? 1970 –-80 దశాబ్దాలలో ఉమ్మడి రాష్ట్రంలో 5 గురు ఎమ్మెల్యేలు ఉన్న కురుమ కులం తర్వాత క్రమంలో తీవ్ర రాజకీయ అణచివేతకు గురైంది.  గత 40 ఏండ్ల నుంచి కురుమలు శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. దీనికంతటికి కారణం ప్రభుత్వాలు  కురుమలను యాదవులతో కలిపి ఒకే దృష్టితో చూడటమే కురుమలకు రాజకీయంగా జరిగిన పెద్ద మోసం! కురుమలకు, యాదవులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ లు ఉన్నా కూడా కురుమలకు జనాభా ప్రకారం రావలసిన రాజకీయవాటా, నామినేటెడ్ పదవులు గాని, ఎమ్మెల్యే, ఎంపీ పదవులు గాని కురుమలకు రాకుండా యాదవులకు కేటాయించడమే కురుమలపై జరుగుతున్న పెద్ద మోసం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక  యాదవులకు ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, రెండు చైర్మన్ పదవులు కేటాయించడం జరిగింది.  మరి యాదవులకన్నా ఎక్కువ  ఉన్న కురుమలకు ఏమిచ్చారు? 

కేసీఆర్​ కపట ప్రేమ

కురుమలకు రావలసిన గొర్రెలు మేకల ఫెడరేషన్ చైర్మన్ పదవి, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ పదవులు ఇతర కులాలకు ఇచ్చి కురుమలకు అన్యాయం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమల మీద వల్లమాలిన ప్రేమ, అభిమానం ఒలకపోస్తుంటారు. బీసీ కులాలకు, దళితులకు, గిరిజనులకు, ముస్లింలకు ప్రకటించినట్లు 100% సబ్సిడీతో బంధు పథకం గొర్రెల కాపరులకు, కురుమలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాం. 

గొర్రెల పంపిణీలోనూ మోసాలే

కురుమలను కోటీశ్వరులను చేస్తానని తెచ్చిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం 100% సబ్సిడీ కాకుండా 25% మార్జిన్ మనీ కురుమల చేత కట్టించుకుని నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ గొర్రెల పంపిణీ పూర్తి చేయలేదు. ఇప్పటివరకు మార్జిన్ మనీ రూపంలో 2 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించగా, ఈ 2 వేల కోట్లకు వడ్డీ కలిపి దాదాపు 4 వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గొర్రెల కాపరులు వడ్డీకి తెచ్చి కట్టిన 25% మార్జిన్ మనీకి వడ్డీ పెరిగి అప్పు రెండింతలు అయిపోయింది కానీ గొర్రెల పంపిణీ ఊరించే పథకంగానే  మిగిలింది.  కురుమలు కేసీఆర్ ప్రభుత్వంలో మోసపోయి గోస పడుతున్నారు. 

న్యాయం చేస్తామనే పార్టీకే మద్దతు

40 నియోజకవర్గాల్లో కురుమలు  అన్ని పార్టీలను ప్రభావితం చేసేస్థితిలో ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు, 2 నామినేటెడ్ ఎమ్మెల్సీ సీట్లు,  చైర్మన్ పదవులు కురుమలకు దక్కాలి. దీనిపై అన్ని పార్టీలు హామీ ఇవ్వాలని కోరుతున్నాం. దానిపై న్యాయం చేసే పార్టీకే కురుమ సంఘం మద్దతునిస్తుందని తెలియజేస్తున్నాం.

- కోశిక శ్రీనివాస రావు, ఉపాధ్యక్షుడు, 
తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం