చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అలంకారణోత్సవం జరగనుండగా, ముక్కర వంశస్తులు వేంకటేశ్వరస్వామికి చేయించిన ఆభరణాలతో అలంకరించనున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎస్బీఐ లాకర్లో ఉన్న ఆభరణాలకు ముక్కర వంశపు రాజా శ్రీరాం భూపాల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆభరణాల పెట్టెను ఆత్మకూర్ నుంచి కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా ఊరేగింపుగా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామంలోని రాంభూపాల్ నివాసానికి చేరుకుంటాయి. ప్రత్యేక పూజల అనంతరం ఆభరణాలు కురుమూర్తి కొండకు చేర్చి, స్వామి వారికి అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఆభరణాలను మళ్లీ ఎస్బీఐ లాకర్లో భద్రపరుస్తారు.
మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం..
కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను పాలమూరుడీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఈవో మధనేశ్వర్ రెడ్డి ఉన్నారు.
