ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేయండి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేయండి
  • సీబీఐకి ఎల్జీ సక్సేనా సిఫార్సు
  • లిక్కర్ లైసెన్స్‌‌‌‌దారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు
  • ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్న ఆఫీసర్లు

న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు చేశారు. 2021– 2022లో తీసుకొచ్చిన ఈ పాలసీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, విధానపరమైన లోపాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ‘‘ఎక్సైజ్ పాలసీపై ఈనెల మొదట్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్టులో.. జీఎన్‌‌‌‌సీటీడీ యాక్ట్ 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్ 2009, ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010ను ప్రాథమికంగా ఉల్లంఘించినట్లు ఎల్జీ గమనించారు. రిపోర్టు కాపీని ముఖ్యమంత్రికి కూడా పంపారు. టెండర్ తర్వాత మద్యం లైసెన్స్‌‌‌‌దారులకు అనవసర ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశపూర్వకంగా విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో సీబీఐ దర్యాప్తు చేయాలని ఎల్జీ సిఫార్సు చేశారు’’ అని అధికారులు చెప్పారు. ‘‘రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఆర్థికంగా క్విడ్ ప్రో కో జరిగిందని, రూల్స్‌‌‌‌ను ఉల్లంఘించి ఎక్సైజ్ మంత్రి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని ఎల్జీ గుర్తించారు. లిక్కర్ లైసెన్స్‌‌‌‌దారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని, దీంతో ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు’’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియానే ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. కొన్ని నిర్ణయాలు కేబినెట్ ఆమోదం లేకుండా ఆయన తీసుకున్నారని, దీనిపై అప్పటి ఎల్‌‌‌‌జీ కూడా అభ్యంతరం చెప్పారని  తెలిపాయి. 

బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులు

గతేడాది నవంబర్ 17న 2021- 22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఢిల్లీలోని 32 జోన్లలో 849 మందికి రిటైల్ లైసెన్స్‌‌‌‌లు మంజూరు చేసింది. ఈ పాలసీని కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై దర్యాప్తు చేయించాలంటూ ఎల్జీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. మరోవైపు లైసెన్స్ పొందిన వాళ్ల లైసెన్స్ ఫీజులు దాదాపు రూ.144.36 కోట్లను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మాఫీ చేసింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు జోన్‌‌‌‌లో లైసెన్స్ పొందిన వారికి రూ.30 కోట్లను రీఫండ్ చేసింది. 

ఫేక్ కేసు.. రవ్వంత కూడా నిజం లేదు: కేజ్రీవాల్

సీబీఐ ద్వారా ఫేక్ కేసులో సిసోడియాను ఇరికిస్తారని, త్వరలోనే ఆయన్ను అరెస్టు చేయొచ్చని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు సిసోడియా 22 ఏండ్లుగా తెలుసని, ఆయన నిజాయితీపరుడని చెప్పారు. ‘‘మనీశ్ సిసోడియాపై సీబీఐకి ఓ కేసు వెళ్లిందని తెలిసింది. ఇది పూర్తిగా ఫేక్ కేసు. రవ్వంత నిజం కూడా లేదు” అని అన్నారు. ఈ కేసు కోర్టులో నిలబడదని, సిసోడియా స్వేచ్ఛగా తిరిగొస్తారని చెప్పారు. తప్పు చేయరు కాబట్టి ఆప్ లీడర్లు జైలుకు వెళ్లడానికి భయపడబోరని అన్నారు.