
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అస్వస్థతకు గురయ్యారు. విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్కు వెళ్లిన ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో అధికారులు హాస్పిటల్ కు తరలించారు. కేసినో కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఆయనను ప్రశ్నించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ ఆఫీస్ కు చేరుకున్న ఆయనకు బీపీ డౌన్ కావడంతో అస్వస్ధతకు గురయ్యారు.
చికోటి ప్రవీణ్ కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్, ఫెమా కేసులకు సంబంధించి ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో 130 మందికి నోటీసులిచ్చిన ఈడీ ప్రతిరోజు ఇద్దరిని విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరయ్యారు. నిన్న ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి, హైదరాబాద్ పంజాగుట్ట ఊర్వశి బార్ ఓనర్ యుగంధర్ ను ప్రశ్నించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. గోవా, నేపాల్, థాయ్ లాండ్, హాంకాంగ్ లో క్యాసినోకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈడీ విచారిస్తోంది. ఈ వారంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్లను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు.