11 కి.మీ. మట్టి రోడ్డే!

11 కి.మీ. మట్టి రోడ్డే!
  • బీటీ వేయకుంటే మేడారం జాతరకొచ్చే 4 రాష్ట్రాలభక్తులకు ఇక్కట్లు
  • సౌకర్యాల కల్పనకు రూ. కోట్లు విడుదల చేస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
  • గోవిందరాజుని మేడారం తీసుకొచ్చే రోడ్డు కూడా ఇదే
  • ఆ దారిలో నడవలేక ఇబ్బంది పడుతున్న గిరిజన పూజారులు

నాలుగు రాష్ట్రాల ప్రజలు వచ్చే దారి అది. 11 కి.మీ. ఉన్న ఆ రోడ్డు అధ్వానంగా ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మధ్యప్రదేశ్‌‌‌‌, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరంతా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి దగ్గర 163 నేషనల్‌‌‌‌ హైవే క్రాస్‌‌‌‌ చేసి మేడారానికి చేరుకుంటారు. ఈ రూట్‌‌‌‌లో 163 నేషనల్‌‌‌‌ హైవే నుంచి మేడారం వరకు మొత్తం 30 కి.మీ. దూరం ఉండగా చిన్నబోయినపల్లి నుంచి మల్యాల వరకు 16 కి.మీ. దూరం సింగిల్‌‌‌‌ డాంబర్‌‌‌‌ రోడ్డు ఉంది. మళ్లీ ఊరట్టం నుంచి మేడారం వరకు 3 కి.మీ. డబుల్‌‌‌‌ డాంబర్‌‌‌‌ రోడ్డు ఉంది. మధ్యలో మల్యాల నుంచి ఊరట్టం వరకు 11 కి.మీ. మట్టి రోడ్డే. ఈ రోడ్డు ప్రస్తుతం పూర్తిగా గుంతలమయంగా ఉంది. అక్కడక్కడ వాగులు కూడా ఉన్నాయి. కనీసం వాగులపై వంతెనలు కూడా కట్టలేదు. 

గిరిజన పూజారులకు తప్పని ఇక్కట్లు
మేడారం మహాజాతర తొలిరోజు సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజును గిరిజన పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇదో మహాద్భుతమైన ఘట్టం. అయితే గోవిందరాజుల గుడి మేడారానికి 14 కి.మీ. దూరంలో ఇదే రూట్‌‌‌‌లో ఉన్న కొండాయిలో ఉంది. అక్కడి నుంచి ఊరట్టం వరకు 9.5 కి.మీ. దూరం ఉంటుంది. ప్రతి మహాజాతర సమయంలో గిరిజన పూజారులు 9.5 కి.మీ. దూరం మట్టి రోడ్డుపైనే నడుచుకుంటూ వస్తారు. ఊరట్టం, కొండాయి మధ్య ఉన్న కొండ్రెడు వాగుపై  బ్రిడ్జి లేకపోవడంతో చాలా ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.

30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం మహాజాతరలు మూడు జరిగాయి. ఫిబ్రవరిలో జరగబోయేది నాలుగో మహాజాతర. ఈ జాతరల కోసం 2016 నుంచి రూ.230 కోట్లకు పైగా నిధులను స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసింది. అయినా మేడారం జాతర ప్రధాన రోడ్ల రూపురేఖలు మారనేలేదు. 30 ఏళ్ల క్రితం ఎలాగైతే మట్టి రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేవారో ఇప్పుడూ అలాగే వెళుతున్నట్లుగా గిరిజన పూజారులు, భక్తులు చెబుతున్నారు. మల్యాల నుంచి ఊరట్టం వరకు ఉన్న మట్టి రోడ్డును డాంబర్‌‌‌‌ రోడ్డుగా మార్చాలని  కొండాయి,  కొత్తూరు, దొడ్ల, షాపెల్లి తదితర గ్రామాల ప్రజలు అనేక ఏళ్లుగా పోరాటాలు చేస్తన్నా ఆఫీసర్లలో చలనం లేదు. మల్యాల నుంచి ఊరట్టం వరకు బీటీ రోడ్డు నిర్మించడానికి 2016లో స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ నుంచి రూ.19 కోట్లు మంజూరయ్యాయి. గడిచిన ఐదేళ్లుగా ఆఫీసర్లు పనులు మాత్రం జరిపించడం లేదు. రోడ్డు వేయడానికి ఫారెస్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు అడ్డు చెబుతున్నారని తప్పించుకోవడానికే పరిమితం అవుతున్నారు.  

ఏండ్లుగా నరకయాతన
జాతరకు అధిక సంఖ్యలో ప్రైవేటు వెహికల్స్​ మల్యాల – ఊరట్టం రూట్​లోనే పోతాయి. రోడ్డు నిర్మాణానికి 2016లోనే నిధులు మంజూరైనప్పటికీ ఆరేండ్లుగా ఫారెస్టు ఆఫీసర్లు పనులను అడ్డుకుంటున్నారు. జాతర సమయంలో గోవిందరాజులను తీసుకెళ్లే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటోంది. ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి చొరవ చూపాలి. 
‒ కాక వెంకటేశ్వర్లు, కొండాయి సర్పంచ్, ఏటూరునాగారం