నిధులు సరిపోక స్కూళ్లలో ఆగుతున్న పనులు

నిధులు సరిపోక స్కూళ్లలో ఆగుతున్న పనులు
  • పైసల్లేక అంచనాలు తగ్గించాలని కలెక్టర్ల ఆదేశాలు
  • జిల్లాకు రూ.2 కోట్లు మాత్రమే మంజూరు చేసిన సర్కార్​
  • కొత్త క్లాస్​ రూమ్​లు లేనట్టే..చిన్న చిన్న రిపేర్లకే ప్రాధాన్యం​ 
  • నిధులు సరిపోక స్కూళ్లలో ఆగుతున్న పనులు
  • ‘ఉపాధి నిధుల’ తో చేపట్టిన పనులే జరుగుతున్నయ్​

వెలుగు, నెట్​వర్క్: మూడు వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే ‘మన ఊరు–-మన బడి’ పథకానికి సర్కారు వంద కోట్లు కూడా ఇయ్యకపోవడంతో ఆఫీసర్లు పనుల్లో కోతలు పెడ్తున్నారు. తొలి విడత 9,123 బడుల్లో మౌలిక వసతుల కోసం రూ.3,497.62 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం ఇచ్చిన రూ.100 కోట్లు ఏమూలకూ చాలడం లేదు. దీంతో జిల్లాల్లో ఆయా స్కూళ్ల నుంచి ఇప్పటికే అందిన అంచనాలను వీలైనంతగా​ తగ్గించి పంపాలని కలెక్టర్లు పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశిస్తున్నారు. సర్కారు నుంచి సరిపడా నిధులు రానందున, ఇప్పట్లో వచ్చే అవకాశం లేనందున అదనపు గదులవంటి కొత్త నిర్మాణాలు పక్కన పెట్టి చిన్నచిన్న మరమ్మతులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, ఏఈతో కూడిన కమిటీలు మరోసారి స్కూళ్లు తిరుగుతూ కొత్త అంచనాలు రూపొందించే పనిలో పడ్డాయి. దీన్ని చూస్తే రాష్ట్రంలోని సర్కారు బడులన్నింటినీ రాబోయే రెండేండ్లలో ఢిల్లీ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామన్న సర్కారు మాటలు ఉత్తవేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

12 రకాల పనులు..

రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు స్కూళ్లు ఉండగా ‘మన ఊరు.. మనబడి’ కింద  రూ.7,289.54కోట్లతో మూడు విడతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత 9,123 బడులను ఎంపిక చేసి, రూ.3,497.62కోట్లతో12రకాల సౌలతులు కల్పిస్తామని ఫిబ్రవరిలో ఉత్తర్వు ఇచ్చింది. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన స్కూల్​ బిల్డింగ్​లకు అవసరమైన అన్ని రిపేర్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త గదులతో పాటు కిచెన్ షెడ్లు, ప్రహరి, మరుగుదొడ్లు, డైనింగ్​రూమ్​ల నిర్మాణం చేపట్టాలి. 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు ప్రాథమిక పాఠశాల ఇది. మన ఊరు–మన బడి పథకంలో భాగంగా ఈ జిల్లాలో మొదటి విడత ఎంపిక చేసిన 176 స్కూళ్లలో ఒకటి. ఇక్కడ 170 మంది స్టూడెంట్స్ ఉండగా మూడే గదులున్నాయి. దీంతో అదనంగా ఒక గది, ప్రహరి, మరుగుదొడ్లు, లైటింగ్ సిస్టం, ఫర్నిచర్, పెయింటింగ్స్, గ్రీన్ బోర్డులు తదితర 12 పనులకు ప్రతిపాదనలు పెట్టారు. పాఠశాల నిర్వహణ కమిటీతో చర్చించి రూ.26.72 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు ఏప్రిల్ 13న కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారు. కానీ తర్వాత కొత్త నిర్మాణాలు వద్దని కేవలం ఎలక్ట్రిఫికేషన్, తాగునీటి సరఫరా, ఇతర మరమ్మతుల కోసం రూ.7.58 లక్షలు కేటాయించారు. దీంతో ఎప్పట్లాగే పిల్లలు వరండాలోనో, చెట్ల కిందనే చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంకా తాగునీటి సౌలత్ తోపాటు కుర్చీలు, బెంచీలు సహా అన్ని రకాల ఫర్నిచర్, గ్రీన్ బోర్డ్స్, డిజిటల్​ఎడ్యుకేషన్ కు కావాల్సిన అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

జిల్లాకు రూ.2 కోట్లే

జిల్లాలవారీగా ఎంపిక చేసిన స్కూళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ​ఇంజనీర్లు రూపొందించిన అంచనాలు ఇప్పటికే కలెక్టర్లకు అందాయి. ముందుగా అనుకున్న ప్రకారం ప్రతి జిల్లాకు కనీసం రూ.100 కోట్లు ఇవ్వాల్సిన సర్కారు కేవలం రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసింది. నారాయణపేట లాంటి చిన్న జిల్లాలకైతే రూ.70లక్షల చొప్పునే ఇచ్చింది. ఈ ఫండ్స్​ఏ మూలకూ చాలే అవకాశం లేకపోవడంతో కొత్త నిర్మాణాల జోలికి పోకుండా అత్యవసరమైన పనులు మాత్రమే చేపట్టాలని, అలాగే అంచనాలు తగ్గించి పంపాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్లు ఆదేశిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు–మన బడి’ కి గతంలో పంపిన అంచనాలు తగ్గించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పంచాయతీ రాజ్ ఈఈ తెలిపారు. కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం పెట్టుకోవద్దని, అందుకు బదులు రిపేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కలెక్టర్​ సూచనల మేరకు మండలాలవారీగా తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, ఏఈలతో ఒక టీమ్​ను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో 64 సర్కారు బడులు ఉండగా, ఇందులో 21 స్కూళ్లను మొదటి విడతలో ఎంపిక చేశారు. ఈ 21 బడుల్లో మౌలికవసతుల కల్పనకు మొదట రూ.9కోట్లతో అంచనాలు రూపొందించారు. కానీ ఫండ్స్ లేకపోవడంతో ఇప్పుడు రూ.5 కోట్ల 30 లక్షలకు కుదించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన 13స్కూళ్లకు రూ.4కోట్లతో ఎస్టిమేషన్స్ తయారుచేశారు. తాజాగా ఫండ్స్ లేవని రూ.కోటిన్నరకు కుదించారు. వనపర్తి జిల్లాలోని 183 స్కూళ్లలో మౌలిక వసతుల కోసం రూ.51 కోట్లతో అంచనాలు పంపగా, 121 స్కూళ్ల అంచనాలు వెనక్కి పంపారు. సిద్దిపేట జిల్లాలో 343  బడులకు రూ.89 కోట్లతో అంచనాలు పంపించారు. వంట గదుల నిర్మాణానికి రూ.20 లక్షలతో అంచనాలు రూపొందించగా, వాటిని రూ.13 లక్షలకు తగ్గించి పంపాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 161  స్కూళ్లను మన ఎంపిక చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పుడు 52 స్కూళ్లకే పరిమితం చేశారు. ఇందులోనూ 49 స్కూళ్లకు రీ అంచానాలు వేయాలని చెప్పడంతో ఆఫీసర్లు ఆ పనిలో ఉన్నారు. నారాయణపేట జిల్లాలో 174 స్కూళ్లను ఎంపిక చేసి రూ.27 కోట్ల అంచనాలు పంపించారు. కానీ రూ.70 లక్షలు మాత్రమే మంజూరుకావడంతో అధికారులు తలపట్టుకున్నారు.

ఆగిపోతున్న పనులు.. ఆదుకుంటున్న ఉపాధి హామీ

రూ.30 లక్షల కంటే ఎక్కువ నిధులు అవసరమయ్యే పనులకు పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలవాలి. కానీ నిధులు లేక వెయ్యికి పైగా స్కూళ్లలో టెండర్లు నిలిచిపోయాయి. రూ.30 లక్షల కన్నా తక్కువ ఖర్చయ్యే బడుల్లో పనులను స్కూల్​మేనేజ్​మెంట్ కమిటీలే చేస్తుండగా, చాలాచోట్ల ఫండ్స్​లేక ఆగిపోయాయి. దీంతో వీలైనంతవరకు ఈజీఎస్ స్కీంను వాడుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. నిజానికి ‘మన ఊరు–మన బడి’ కింద చేపట్టాలనుకున్న 12 రకాల పనుల్లో టాయిలెట్లు, కిచెన్​షెడ్లు, ప్రహరిలు ఇలా ఎనిమిది రకాల పనులకు ఉపాధి నిధులు వాడుకునే అవకాశం ఉండడంతో ఆయా చోట్ల అరకొరగానైనా పనులు నడుస్తున్నాయి. ఉదాహరణకు నారాయణపేట జిల్లాలో 174 స్కూళ్లను ఎంపిక చేసి రూ.27 కోట్లతో పనుల అంచనాలు పంపించారు. ఇందులో ఈజీఎస్ కింద రూ.7 కోట్లు చూపారు. కానీ సర్కారు నుంచి కేవలం రు.70 లక్షలు మాత్రమే రావడంతో ఆఫీసర్లు రూ.7 కోట్ల ఉపాధి నిధులతో టాయిలెట్లు, కిచెన్​షెడ్ల నిర్మాణం చేపడుతూ, గోడలకు రంగులు వేస్తున్నారు.

క్వాలిటీ మరిచిపోవాల్సిందేనా?

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని 24 స్కూళ్లలో పనుల అంచనాలను సగానికి పైగా తగ్గించారు. ఉదాహరణకు చెన్నూరు జడ్పీ స్కూల్​కు రూ.80లక్షలతో అంచనాలు పంపితే,  ఇప్పుడు రూ.30 లక్షలకు తగ్గించారు. సగానికి పైగా నిధులు కోత పడడంతో పనుల నాణ్యత ఎలా ఉంటుందోనని స్కూల్ హెచ్ ఎం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జిల్లా లింగాలఘణపురం మండలంలోని నేలపోగుల యూపీఎస్​​లో పనులకు తొలుత రూ.11 లక్షలు అంచనా వేయగా దానిని రూ.5 లక్షలకు తగ్గించారు. వరంగల్ జిల్లా రాయపర్తి హై స్కూల్ లో వివిధ అభివృద్ధి పనులకు రూ.96 లక్షలతో అంచనాలు వేశారు. తర్వాత రూ.80 లక్షలకు, తీరా ఇప్పుడు రూ.50 లక్షలకు తగ్గించారు. మహబూబాబాద్ జిల్లా మండలం కొత్తగూడ మండలం వేలుబెల్లి ప్రైమరీ స్కూల్​కు రూ.60 లక్షలతో అంచనాలు పంపగా, ప్రస్తుతం రూ.7లక్షలతో రిపేర్లు చేయాలని అదేశాలు వచ్చినట్టు  ఐటీడీఏ ఏఈ రవి తెలిపారు.

అంచనాలు తగ్గించి పంపినం..

బోర్లగూడెం యూపీఎస్​ను ‘మన ఊరు–మన బడి’కి ఎంపిక చేశారు. ఇక్కడ 220 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ప్రస్తుతం ఆఫీస్​రూముతో కలుపుకొని ఎనిమిది గదులు మాత్రమే ఉండడంతో సరిపోవడం లేదు. దీంతో కొత్తగా మరో మూడు క్లాస్​రూంలు, తాగునీటి సరఫరా, రిపేర్లకు కలిపి రూ.24 లక్షలతో అంచనాలు పంపినం. ఇప్పుడు అదనపు గదులు అవసరం లేదని, అందువల్ల పాత అంచనాలు మార్చి పంపాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రూ.4లక్షల మేరకే తాగునీటి సరఫరా, రిపేర్లు, ఎలక్ట్రికల్ పనుల కోసం అంచనాలు పంపినం.

- జాటోత్ రాంసింగ్, బోర్లగూడెం యూపీఎస్ ​హెచ్​ఎం, భూపాలపల్లి జిల్లా