తెలంగాణ సర్కార్​కు ఆ మూడింటితో పరేషాన్​

తెలంగాణ సర్కార్​కు ఆ మూడింటితో  పరేషాన్​

రాష్ట్ర సర్కార్​కు ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్లు, ఆసరా పింఛన్​దారుల టెన్షన్ పట్టుకున్నది. ఉద్యోగులకి డీఏ ఎరియర్స్ ఇవ్వడంతో పాటు పెండింగ్ డీఏ ప్రకటిం చాల్సి ఉన్నది. స్టూడెంట్లకు ఫీజురీయింబర్స్ మెంట్ బాకీలు, స్కాలర్ షిప్ చెల్లింపులు రెండేండ్లుగా పెండింగ్​లో పడ్డాయి. 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్లు అందడం లేదు. అర్హులు ఇంకా లక్షల్లో ఉన్నారు. దివ్యాంగుల మాదిరి మిగిలిన పింఛన్లు కూడా పెంచి ఎన్నికలకు నెల ముందే ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తున్నది. ఇవన్నీ చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం కానున్నాయి. ఇప్పటికే ముఖ్యం అనుకున్న గృహలక్ష్మి, దళితబంధు స్కీములు పట్టాలు ఎక్కలేదు. ప్రాధాన్యత అనుకున్న రైతు రుణమాఫీకి ఇంకా రూ.12 వేల కోట్లు అవసరం. వీటిని దాటి డీఏ, ఆసరా, ఫీజురీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్​లకు నిధులు ఎట్లా అనేది సర్కార్​కు టెన్షన్​గా మారింది. భూములు అమ్ముతున్నా , అప్పులు చేస్తున్నా ఎలక్షన్ల కోసం ప్రభుత్వం అన్నీ ఒక్కసారే మొదలు పెట్టడంతో ఆదాయం సరిపోవడం లేదు. దీంతో ఇవన్నీ ఎన్నికల్లో నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతో పాటు పీఆర్సీ కూడా ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో డీఏ ఎంత ప్రకటిస్తారో చెప్పడంతో పాటు పీఆర్సీ (పే రివిజన్ కమిటీ) ఏర్పాటుపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ప్రకటించిన డీఏలకు సంబంధించిన ఎరియర్స్​ను ప్రభుత్వం ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయలేదు. ఇవి దాదాపు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మొత్తం 7.27 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ఇప్పుడు కొత్త డీఏ ప్రకటించడంతో పాటు ఎరియర్స్​ను రిలీజ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పైగా ప్రభుత్వానికి సీపీఎస్ స్కీమ్​ ఆందోళన మరో తలనొప్పిగా మారింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్​ను అమలు చేయాలని దాదాపు లక్షా 70 వేల మంది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఎలక్షన్ల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ భారం కూడా ఆర్థిక శాఖపై పడుతుంది.

ఆసరా దిగులు

ఇంకోవైపు ఆసరా పింఛన్లు కూడా రాష్ట్ర సర్కారును ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆసరా పింఛన్​దారులే అధికార పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేశారని ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా వాళ్ల ఓట్లను పొందేందుకు ఏం చేయాలని ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. గత ఏడాది ఆగస్టులో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటించుకుంది. 46 లక్షల మందికి ఆసరా అందుతుంది అని చెప్పుకుంది. అయితే ఇస్తున్నది మాత్రం 44.30 లక్షల మందికే. వాస్తవానికి 57 ఏండ్లు నిండినోళ్ల నుంచి పెద్ద మొత్తంలో అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 16 లక్షల దరఖాస్తులు వస్తే అందులో కొత్తగా ఇచ్చింది 7 లక్షల లోపే ఉన్నాయి. ఇంకా అర్హులు 6-7 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కొత్త అప్లికేషన్లకి అవకాశం ఇవ్వడంతో పాటు అర్హులందరికీ దివ్యాంగుల మాదిరి కొంత మొత్తం పెంచి ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నది. అది కూడా వచ్చే నెలలోనే. ఇది కూడా నిధులతో కూడుకున్నదే కావడంతో ఆర్థిక శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. 

ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్ షిప్​ల సెగ

ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​లు బకాయిలు అంతకంతకు తడిసిమోపెడవుతున్నాయి. దాదాపు 25 లక్షలాది మంది స్టూడెంట్లకు ఫీజు రీయింబ ర్స్​మెంట్, స్కాలర్​షిప్​లు అందాల్సి ఉంది. దీంతో యువ ఓటర్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనే భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. టైం కు నిధులు ఇవ్వకపోవడంతో  కొన్ని కాలేజీలు స్టూడెండ్ల నుంచే ఫీజులు వసూలు చేస్తున్నాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్​కి సంబంధించిన పైసలు ఫైనల్ ఇయర్​లో ఇస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ కింద ఇవ్వాల్సిన బకాయిలు రూ.4 వేల కోట్ల దాకా ఉన్నాయి.

భూములు అమ్ముతున్నా..  అప్పులు చేస్తున్నా..

రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం అప్పులు చేస్తున్నా.. సర్కార్ భూములను అమ్ముతున్నా.. ఇతర ఎక్సైజ్ ఆదాయం బాగానే వస్తున్నా సరిపోవడం లేదు. ఎలక్షన్ల నేపథ్యంలో ఒక్కసారి అన్ని స్కీములను ముంగట పెట్టుకోవడంతో నిధుల సర్దుబాటు తలకు మించిన భారంగా మారిందని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ఇటీవల రూ.9 వేల కోట్ల విలువజేసే భూములు అమ్మింది. వీటికి సంబంధించి ఇంకా రూ.7,500 కోట్లు రావాల్సి ఉంది. ఓఆర్ఆర్ టీవోటీకి ఇవ్వడంతో రూ.7,300 కోట్లు రాగా దానిని రుణమాఫీ కోసం సర్దుబాటు చేశారు. యావరేజ్​గా ప్రతి నెలా రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇంకా రుణమాఫీ కోసం రూ.12 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దీంతోపాటు గృహలక్ష్మి దళిత బంధు స్కీములు అమలు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించి ఇంకా ఒక్క పైసా ఇవ్వలేదు. కనీసం రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు ఈ రెండు స్కీములకు ఇవ్వాలని ప్రభుత్వం భావి స్తున్నది. అయితే గత అప్పుల కిస్తీలు, వడ్డీలకే నెలానెలా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తున్నది.

నిరుద్యోగుల అసంతృప్తి


ప్రణాళిక లేకుండా ఒకేసారి టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ మొదలు పెట్టడం, ఇంకోవైపు పేపర్ లీకేజీలు, ఇపుడు డీఎస్సీలో పూర్తిస్థాయి లో పోస్టులు నింపడం లేదంటూ ఆందోళనలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా.. ఎన్నికల కోసమే ఉద్యోగాల భర్తీ పేరిట హడావుడి చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. గ్రూప్ 2 వాయిదా కోసం నిరుద్యోగులు ఆందోళన చేపట్టడంతో సర్కార్ దిగొచ్చి వాయిదా వేసిన విషయం విదితమే.