సీఎం కప్​ పోటీల నిర్వహణకు పైసల్లేవ్..ఖర్చు రూ.5 లక్షలు ..ఇచ్చింది రూ.70 వేలే

సీఎం కప్​ పోటీల నిర్వహణకు పైసల్లేవ్..ఖర్చు రూ.5 లక్షలు ..ఇచ్చింది రూ.70 వేలే
  • జిల్లా స్థాయి పోటీలకు నిధులు అంతంతే
  • సుమారు రూ.5 లక్షలు ఖర్చుకు ఇచ్చింది రూ.70 వేలే
  • సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో సౌలత్​లు లేక క్రీడాకారులకు ఇబ్బందులు

ఎల్​బీనగర్, వెలుగు: రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సీఎం కప్-–2023 పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 24వ తేదీ వరకు జరగనున్నాయి. సీఎం పేరుతో నిర్వహిస్తున్న ఈ 
క్రీడలకు నిధులు కరువయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల నుంచి ప్లేయర్లను సరూర్​నగర్ ఇండోర్ స్టేడియానికి తీసుకువచ్చి మండుటెండలో ఆడిస్తున్న నిర్వాహకులు వారికి కనీస సౌలత్​లు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మొదటి రోజు క్రీడాకారులకు  మధ్యాహ్నం భోజనం కూడా సరిగా అందించలేదు. వారికి స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.

నిధులు లేక..

సాధారణంగా ఎలాంటి గేమ్స్ నిర్వహించేప్పుడైనా ప్లేయర్లకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఒక అరటిపండు, గుడ్డు ఇస్తారు. ఆటకు ముందు కానీ ముగిసిన తర్వాత కానీ వీలైతే ఎనర్జీ డ్రింక్ ఇస్తారు. అంతే కాకుండా మధ్యాహ్నం పోషకాలు కలిగిన మంచి భోజనం పెట్టాలి. కానీ సీఎం కప్​పోటీలకు వచ్చిన ప్లేయర్స్ కు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ టోర్నీకి అరకొర బడ్జెట్​కేటాయించడమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులు ఇచ్చి నిర్వహించే అధికారులు.. క్రీడలకు మాత్రం అతి తక్కువ బడ్జెట్​కేటాయిస్తూ కనీస సౌలత్​లు కల్పించకుండా ప్లేయర్లను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కప్ జిల్లా స్థాయి నిర్వహణకు సుమారు రూ.5 లక్షల బడ్జెట్ ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ.70 వేలు ఇచ్చి లాంచింగ్, ఎండింగ్ ప్రోగ్రాం నిర్వహించి, పోటీల్లో పాల్గొనే ప్లేయర్లకు సౌకర్యాలు కల్పించాలని సూచించింది. దీంతో  ఏం చేయాలో తెలియక నిర్వాహకులు తలలు 
పట్టుకుంటున్నారు.

కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వట్లే..

సీఎం కప్ ప్రారంభమైన మొదటి రోజు భోజనం కాదు కదా కనీసం మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి. పేపర్లు, టీవీల్లో ఈ విషయం రావడంతో మంగళవారం ఫుడ్ అందించారు.  కానీ ఇంకా ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు. అధికారులు దీనిపై స్పందించి సౌలత్ లు కల్పించాలి.
– సౌమ్య,ప్లేయర్

ఆకలికి ఇబ్బంది పడ్డం

ప్లేయర్లకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. మారుమూల ప్రాంతంలోని ఇంటి నుంచి ఉదయం ఆరు గంటలకే బయలుదేరి వస్తే మధ్యాహ్నం భోజనం లభించలేదు. మొదటి రోజే ఆకలికి ఇబ్బంది పడ్డాం. ఆటల్లో పాల్గొనేందుకు  కనీసం డ్రెస్ కూడా ఇవ్వలేదు.
శ్రీధర్, కబడ్డీ ప్లేయర్