రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో ఆఫీసర్లు లేక కుంటుపడుతోన్న పాలన

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో ఆఫీసర్లు లేక కుంటుపడుతోన్న పాలన
  • మెట్​పల్లి బల్దియాలో భారీగా ఖాళీలు
  • ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం
  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు 
  • రామగుండం టౌన్ ప్లానింగ్‌‌‌‌లో 16 మందికి ఇద్దరితోనే పనులు

గోదావరిఖని, వెలుగు : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌లో ఆఫీసర్లు లేక పాలన కుంటుపడుతోంది. కార్పొరేషన్‌‌‌‌లో కీలకమైన టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌, శానిటేషన్‌‌‌‌, రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్లలో ఆఫీసర్లు లేక ఇన్​చార్జిలతో నెట్టుకొస్తున్నారు. పనిభారం పెరగడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌పై పట్టింపేదీ..?

కార్పొరేషన్‌‌‌‌లో ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్లు, ఎంక్రోచ్‌‌‌‌మెంట్లు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ విభాగం సిబ్బందిలేక కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ 16 మంది టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ ఆఫీసర్లు పనిచేయాల్సి ఉండగా ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు. వారిలో కూడా ఒకరికి మంచిర్యాల మున్సిపాలిటీకి డిప్యూటేషన్‌‌‌‌ వేయడంతో ఆయన మూడు రోజులు అక్కడ, మూడు రోజులు రామగుండంలో డ్యూటీ చేస్తున్నారు. కీలకమైన అసిస్టెంట్‌‌‌‌ సిటీ ప్లానర్‌‌‌‌ను 20 రోజుల క్రితం బదిలీచేయగా ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. కొత్త బిల్డింగ్‌‌‌‌ల నిర్మాణానికి అవసరమైన ఫైల్‌‌‌‌ మూ‌‌మెంట్ సమయానుకూలంగా ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఆరు టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ ఇన్​స్పెక్టర్‌‌‌‌ పోస్టులు, టౌన్‌‌‌‌ సర్వేయర్‌‌‌‌‌‌, టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ ట్రేసర్‌‌‌‌‌‌, క్యాడ్‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లు ఖాళీగా ఉన్నప్పటికీ  ఏ ఒక్కటీ భర్తీ చేయలేదు.

అభివృద్ధి పనులపై ప్రభావం..

కార్పొరేషన్‌‌‌‌లో డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ వర్క్‌‌‌‌ల గురించి టెండర్ల నిర్వహణ, పనుల కేటాయింపు తదితర పనులన్నీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌(ఈఈ) పర్యవేక్షణలో జరుగుతాయి. రామగుండం కార్పొరేషన్‌‌‌‌లో పనిచేసిన ఈఈ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఇద్దరు డీఈలకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఒక డీఈ 15 రోజుల క్రితం సెలవుపై వెళ్లారు. దీంతో ఉన్న ఒక్క డీఈపై పనిభారం పెరిగింది. 

రెవెన్యూ, శానిటేషన్‌‌‌‌లో కూడా...

రామగుండం కార్పొరేషన్‌‌‌‌లో శానిటరీ సూపర్‌‌‌‌వైజర్, హెల్త్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టులు ఉన్నా భర్తీ చేయకుండా ముగ్గురు శానిటరీ ఇన్​స్పెక్టర్లతో నెట్టుకొస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో రెవెన్యూ ఇన్​స్పెక్టర్‌‌‌‌కు బదులుగా జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌తో పని చేయిస్తున్నారు. కౌన్సిల్‌‌‌‌ మీటింగ్, ఇతర కార్యకలాపాలు చూడాల్సిన కార్పొరేషన్‌‌‌‌ సెక్రెటరీ 6 నెలల క్రితం బదిలీ కాగా ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు.

మెట్ పల్లిలో 45 రోజులుగా..

మెట్ పల్లి, వెలుగు: స్థానిక బల్దియాలో ఇన్​చార్జి కమిషనర్ పాలన కొనసాగుతుండడంతో ప్రజా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడంలేదు. మెట్ పల్లి బల్దియాలో కమిషనర్ గా విధులు నిర్వర్తించిన సల్వాది సమ్మయ్య అక్టోబర్ 30న హుజూరాబాద్ బల్దియాకు బదిలీపై వెళ్లారు. దీంతో 45 రోజులుగా ఇంజనీరింగ్ విభాగం డీఈ రాజ్ కుమార్ కు ఇన్​చార్జి కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పట్టణంలో 26 వార్డులు ఉండగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ఇంటి నంబర్ల కేటాయింపు తదితర పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ సెక్షన్లలో కీలక పోస్టులు ఖాళీలు ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

భారీగా ఖాళీలు..

టౌన్ విభాగంలో టీపీఎస్, టీపీఓ, ఇంజినీరింగ్ సెక్షన్ లో ఏఈ, అకౌంట్స్ సెక్షన్ లో ఏఓ పోస్టులు కొన్నెండ్లుగా ఖాళీగా ఉన్నాయి. కొన్ని విభాగాల్లో వారానికి 3 రోజులు డిప్యుటేషన్ పై కొందరు ఉద్యోగులు పని చేస్తున్నారు.  మిగతా నాలుగు రోజులు సంబంధిత శాఖ అధికారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.