కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటో.. ప్రధాని మోడీకి కేజ్రీవాల్ రిక్వెస్ట్​.. 

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటో.. ప్రధాని మోడీకి కేజ్రీవాల్ రిక్వెస్ట్​.. 

న్యూఢిల్లీ: ఇండియన్​ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేషుడి ఫొటోలు ముద్రించాలని ప్రధాని మోడీని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి దేవుళ్ల ఆశీర్వాదాలు కూడా ముఖ్యమన్నారు. ఒక వైపు మహత్మా గాంధీ ఫొటో ఉంటుందని, మరోవైపు లక్ష్మీ, వినాయకుడి ఫొటోలు ముద్రిస్తే ప్రజలపై వారి బ్లెస్సింగ్స్​ ఉంటాయని తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్​ కాన్ఫరెన్స్​లో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘‘మన కరెన్సీపై దేవుళ్ల బొమ్మలు ముద్రించాలని మోడీని కోరుతున్నాను. ఇప్పుడు చెలామణిలో ఉన్న నోట్లపై ప్రింట్ సాధ్యం కాదు. అయితే ప్రతీ నెలా నోట్లను ముద్రిస్తుంటాం కదా.. వాటిపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి. నా సూచన ఎవరికీ వ్యతిరేకం కాదు. 87% ముస్లింలు, 2% హిందువులు ఉండే ఇండోనేషియా కరెన్సీపైనే వినాయకుడి ఫొటో ఉంటుంది. అలాంటప్పుడు మన కరెన్సీపై ప్రింట్ చేయడంలో తప్పేంటి?”అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 

దేవుడి ఆశీర్వాదం ఉండాల్సిందే..

యూఎస్​ డాలర్​తో పోలిస్తే ఇండియన్​ కరెన్సీ వ్యాల్యూ రోజూ దిగజారుతూ పోతోందని కేజ్రీవాల్ అన్నారు. దేవుళ్ల ఫొటోలు ముద్రిస్తే ఇండియన్​ ఎకానమీ గాడినపడే అవకాశం ఉందన్నారు.‘‘సోమవారం దీపావళి పూజ చేస్తున్నప్పుడు.. కరెన్సీ నోట్లపై ఇద్దరు దేవుళ్ల ఫొటోలు ఉండాలనే ఆలోచన వచ్చింది. నోట్లపై లక్ష్మీదేవి ఫొటో ఉంటే దేశ ప్రజలకు ఆమె ఆశీర్వాదం ఉంటుంది. వినాయకుడి బొమ్మ ఉంటే కష్టాలు తీరుతాయి. ఎంత కష్టపడ్డా దేవుడి ఆశీర్వాదం లేకుంటే మన ప్రయత్నాలు ఫలించవు” అని కేజ్రీవాల్​ అన్నారు. దీనిపై మోడీకి లేఖ రాస్తానని చెప్పారు.

కేజ్రీవాల్​ది పొలిటికల్​ డ్రామా : బీజేపీ

యాంటీ హిందు మైండ్​సెట్​గా ఉన్న ఆమ్​ ఆద్మీ పార్టీ, హిందువాద పార్టీ అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ సీనియర్​ లీడర్​ సంబిత్​ పాత్రా విమర్శించారు. కేజ్రీవాల్​ది యూ టర్న్ పొలిటికల్​ డ్రామా అని మండిపడ్డారు.

ఇండోనేషియా రూ.20వేల నోటుపై గణేషుడు

ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు (87.20 శాతం) ఉండే ఇండోనేషియాలో, రూ.20వేల నోటుపై వినాయకుడి బొమ్మ ఉంటుంది. చాలా ఏండ్ల కింద ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఎన్నోఇబ్బందులు పడ్డారు. విఘ్నాలు తొలిగించే వినాయకుడి బొమ్మను కరెన్సీపై ప్రింట్​ చేసేందుకు అక్కడి ఆర్థిక వేత్తలు ఓ టీంగా ఏర్పడి చర్చలు జరిపారు. చివరికి 1998లో 20వేల రూపాయల కొత్త నోటుపై గణేషుడి బొమ్మను ప్రింట్ చేయడం మొదలుపెట్టారని ఇండోనేషియా వాసులు చెబుతుంటారు.