ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు వెంకన్న రథోత్సవాన్ని తిలకించారు. ఉదయం నుంచి స్వామివారు రథంపై దర్శనమిచ్చారు. అనంతరం సాయంత్రం ఆలయ పురవీధుల నుంచి శ్రీవారిని ఊరేగించారు. గోవింద నామ స్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్​పర్సన్ జిందం కళ మాట్లాడుతూ రథోత్సవంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లూమ్స్, టెక్స్​టైల్ డెవలప్​మెంట్​కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కౌన్సిలర్లు పద్మ, శ్రీనివాస్, దినేశ్,  రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- సిరిసిల్ల టౌన్, వెలుగు 

ఆడపిల్ల పుట్టింది.. ఇంట్లోకి రానివ్వం

 కోడలిని అనుమతించని అత్త, మామ, భర్త
 ఇంటిముందు బాధితురాలి నిరసన

జమ్మికుంట, వెలుగు : ఆడపిల్ల పుట్టిందని కోడలిని ఇంట్లోకి అనుమతించని ఘటన జమ్మికుంట మండలం మాచనపల్లిలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన స్పందనకు మాచనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల కిరణ్ తో నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి 11 నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. అప్పటి నుంచి కిరణ్ పుట్టింటి నుంచి స్పందనను తీసుకెళ్లకపోవడంతో వీరిమధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో పెద్దమనుషుల సమక్షంలో సమస్య పరిష్కరించుకుని ఒప్పంద తీర్మానం రాశారు. నెలలు గడిచినా అత్త, మామ భర్త స్పందనను తీసుకెళ్లకపోవడంతో స్పందన చంటి పిల్లను తీసుకొని బంధువులతో అత్త ఇంటికి వచ్చింది. అత్త, మామ, భర్త ఇంట్లోకి ఆమెను అనుమతించకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. 

సీఎంకు బండి క్షమాపణ చెప్పాలి:చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ 
కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కు మతి భ్రమించి సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. ఆదివారం నగరంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, సీఎంకు ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షుద్రపూజలు చేయాల్సిన అసవరం సీఎం కేసీఆర్ కు లేదని, బీజేపీ వాళ్లే  క్షుద్రపూజలు చేస్తున్నారన్నారు. మూడేళ్ల క్రితమే చేసుకున్న ఒప్పందం ప్రకారమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరాడని, కాంట్రాక్టుల కోసమే పార్టీ మారినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. 


జగిత్యాలలో కార్డెన్ సెర్చ్ 
60 టూ వీలర్స్, 9 ఆటోలు స్వాధీనం

జగిత్యాల, వెలుగు: జిల్లాకేంద్రంలోని టీఆర్ నగర్ లో డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇల్లు సోదా చేసి సరైన డాక్యుమెంట్స్​లేని 60 టూ వీలర్స్, 9 ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెర్చ్ లో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

కాన్షీరాంకు ఘన నివాళి
సిరిసిల్ల టౌన్, వెలుగు: బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షీరాం 16వ వర్ధంతిని సిరిసిల్ల పట్టణ బీఎస్పీ కన్వీనర్ అన్నల్దాస్ భాను ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత విగ్రహం వద్ద కాన్షీరాం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ సిరిసిల్ల అసెంబ్లీ ఇన్​చార్జి లింగంపల్లి మధూకర్ మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ కో-కన్వీనర్లు అరకల రమేశ్, కొక్కుల రాజు, ఒడ్నాల అనిల్, పొలాస లక్ష్మణ్, చెట్టిపల్లి నరేందర్, తడుక భాను తదితరులు పాల్గొన్నారు. 
కోనరావుపేట:కాన్షీరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని బీఎస్పీ వేములవాడ నియోజకవర్గ ఇన్​చార్జి బొడ్డు మహేందర్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలం ధర్మారంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాన్షీరాం ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కాన్షీరాం అడుగుజాడల్లో నడిచి బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బొడ్డు నవీన్, బొడ్డు అనిల్, సచిన్, అజయ్ పాల్గొన్నారు. 

ఆస్పత్రిలో పసికందు మృతి
కోరుట్ల,వెలుగు: ప్రసవం అనంతరం శిశువు మృతి చెందగా బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేసిన ఘటన ఆదివారం కోరుట్లలో జరిగింది. బాధిత  కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోరుట్ల మండలం చిన్న మెట్​పల్లి గ్రామానికి చెందిన అరికంటి కృష్ణమూర్తి భార్య హర్షిణి శుక్రవారం కోరుట్లలోని శివసాయి హాస్పిటల్ లో ప్రసవం కోసం చేరింది. శనివారం రాత్రి పురిటీ నొప్పులు రావడంతో సిజేరియన్ చేయగా పాప మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. పాప మృత దేహాన్ని కొన్ని గంటల వరకు డాక్టర్లు చూపకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో ప్రజాప్రతినిధులు, పోలీసులు అక్కడికి చేరుకుని డాక్టర్లతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళణ విరమించారు. ఈ విషయమై ‘వెలుగు’ డాక్టర్లు బోగ శంకర్, శ్రీలతను వివరణ కోరగా పాప ఉమ్మ నీరు ఎక్కువగా మింగడంతో మృతి చెందిందని తెలిపారు.

రైతు వ్యతిరేక నిర్ణయాలతో నష్టం:ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, వెలుగు: కేసీఆర్ పాలనలో వరిసాగు మూడింతలు పెరిగిందని, కేంద్ర రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో గతంలో 26 వేల ఎకరాలు ఉన్న వరి సాగు ప్రస్తుతం 68 వేలకు పెరిగిందన్నారు. ధాన్యం ఎగుమతులకు కేంద్రం 20 శాతం సెస్ విధించడం బాధాకరమని, వీటిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ లీడర్లు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సమావేశంలో లో కేడీసీసీ జిల్లా మెంబర్ రామ చందర్ రావు, పీఎసీఎస్  చైర్మన్లు పాల్గొన్నారు.

అ‘పూర్వ’ సమ్మేళనం
రాజన్న సిరిసిల్ల(ఎల్లారెడ్డిపేట), వెలుగు : ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్ జిల్లా పరిషత్​హై స్కూల్​లో ఎస్సెస్సీ 2000 బ్యాచ్ విద్యార్థులు ఆదివా రం కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా పాఠశాలకు 10 ఫ్యాన్లు అందజేశారు. అనంతరం తమ గురువులను సన్మానించారు. ఉన్నత చదువుల కోసం విదేశాల్లో స్థిరపడ్డ వారంతా ఒక్కచోట చేరుకున్నారు. 22 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆటపాటలతో ఆనందంగా గడిపారు. పాత గుర్తులను నెమరేసుకున్నారు. సమ్మేళనానికి టీచర్లు ప్రతాప్, పర్శరాములు, రమణ, బాల్ రాజు, కృష్ణశర్మ, వెంకటయ్య, కిష్టయ్య, రవీందర్, బాబు, జెడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం కృష్ణహరి, ప్రశాంత్ సుమారు 45 మంది విద్యార్థులు హాజరయ్యారు.   

రైలు కింద పడి ఒకరి మృతి
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట, బిసిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ మధ్య సైదాబాద్ రైల్వే గేట్ కి సమీపంలో రైలుకింద పడి వొడ్నాల సతీశ్(31) అనే వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి ఆదివారం తెలిపారు. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో సుమారు 15 ఏళ్ల నుంచి సతీశ్​మతిస్థిమితం లేక తిరిగేవాడని, 
ప్రమాదవశాత్తు రైలు కింద పడి చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుని తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  తిరుపతి తెలిపారు.

రాజన్న సన్నిధిలో భక్తుల కిటకిట
స్వామి దర్శనానికి 3 గంటలు

వేములవాడ, వెలుగు: స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కరీంనగర్, వరంగల్, అదిలాబాద్​, నిజమాబాద్​తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబుబ్ నగర్, నల్గొండ,  మహరాష్ర్ట నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు ఉదయం నుంచే శ్రీఘ్రదర్శనం, ప్రత్యేక క్యూలెన్స్ ద్వారా స్వామిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించారు. అలాగే అనుబంధ ఆలయలైన బద్ధి పోచమ్మ, భీమేశ్వర ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. 

నూతన కార్యవర్గం
కరీంనగర్ సిటీ, వెలుగు : తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ఎం. సతీశ్​కుమార్ తెలిపారు. ప్రెసిడెంట్ గా యు. నాగరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎస్. మధుకుమార్, వైస్ ప్రెసిడెంట్లు గా కె. నీరజ, కె.రమేశ్, యం.  చం ద్రు, సెక్రటరీ గా  అహ్మద్ అబ్దుల్ రసూల్,  జాయింట్ సెక్రెటరీలుగా వి.రాధ, షకీల్ అహ్మద్, అహ్మద్ ఖాన్, ట్రెజరర్ గా కె. రమేశ్​కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుపతి ఎన్నికయ్యారు.

‘జీపీ కార్మికులపై నిర్లక్ష్యం తగదు’
 కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల శ్రీనివాస్, ఎడ్ల రమేశ్​అన్నారు. రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభల సందర్భంగా ఆదివారం నగరంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులకు వేతనాలు పెంచి జీపీ కార్మికులకు మాత్రం మూడేళ్ల నుంచి వేతనాలు పెంచడంలేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా మిలాద్​ ఉన్ ​నబీ
కరీంనగర్ సిటీ, వెలుగు: పట్టణంలోని ముస్లింలు ఆదివారం మిలాద్​ఉన్​నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా మర్కజ్ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీద్ బాబా   ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే నగరంలోని 33 వ డివిజన్ భగత్ నగర్ పెద్దమ్మ దేవాలయం, అయ్యప్ప దేవాలయ సమీపంలో ముస్లింలు అన్నదానం చేశారు. కార్యక్రమానికి నగర మేయర్ సునీల్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ సయ్యద్ అలీ, మహమ్మద్ జమీల్, మహమ్మద్ అమీర్, జైభూన్ యూత్ క్లబ్ సభ్యులు హామీద్, అజ్జూ, సజ్జూ, ఖదీర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.   
పెద్దపల్లి: పట్టణంలోని దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం మహ్మద్​ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో డీసీహెచ్ శ్రీధర్.ఆసుపత్రి సూపరింటెండెంట్  శౌరయ్య, కౌన్సిలర్లు సబీర్ ఖాన్, అశ్రఫ్, ఖదీర్ ఖాన్, కో ఆప్షన్ సభ్యులు ఫహీం, తదితరులున్నారు.    

జమ్మికుంట: మీలాద్- ఉన్- నబి పండుగ సందర్భంగా బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఖురాన్ పఠనం, ఫాతేహ ఖ్వానీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శం అని ప్రవక్త బోధనలతో ప్రపంచశాంతి నెలకొంటుందని మత గురువు మౌలానా హాషీమ్ రజా బోధించారు. కార్యక్రమంలో గురువులు యాసీన్, ఖాజా పాషా, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, దర్గా కమిటీ ఉపాధ్యక్షులు కరీం పాల్గొన్నారు.

వేములవాడ: మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని పట్టణంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కోరుట్ల బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. ర్యాలీలో పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రం, కౌన్సిలర్ లు నిమ్మ శెట్టి విజయ్, గోలి మహేశ్, కో ఆప్షన్ మెంబర్ సర్వర్ అలీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహ్మద్, అంజాద్ పాషా తదితరులు పాల్గొన్నారు. 

ఘనంగా వాల్మీకి జయంతి
జగిత్యాల, వెలుగు: ఆదికవి వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టర్ జి.రవి కలెక్టరేట్ లో వాల్మీకి చిత్రపటానికి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బి.ఎస్.లత, అరుణశ్రీ, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి
రాజన్న సిరిసిల్ల,వెలుగు :  మహాకవి వాల్మీకి సహా మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ పవర్​లూం, జౌళి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్​భంగా ఆదివారం కలెక్టరేట్ లో మున్సిపల్ చైర్ పర్సన్ కళా చక్రపాణి, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావుతో కలిసి వాల్మీకి చిత్రపటానికి నివాలుళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్​మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం విలువలతో కూడినదన్నారు. కార్యక్రమంలో బీసీ డెవలప్​మెంట్ డిస్ట్రిక్ ఆఫీసర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.