‘ లాల్‌సింగ్ చద్ధా’ అడుగులు తడబడ్డయి

‘ లాల్‌సింగ్ చద్ధా’ అడుగులు తడబడ్డయి

ఆమిర్‌‌ ఖాన్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. ‘లాల్‌సింగ్ చద్ధా’ విషయంలో అవి ఆకాశాన్ని అంటాయి. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్‌’కి రీమేక్ కావడమే అందుకు కారణం. రాజకీయ, మతపరమైన కారణాలతో కొంత వ్యతిరేకత ఏర్పడినా.. సినీ ప్రియులు మాత్రం ఈ మూవీ కోసం చాలా ఎదురు చూశారు. ఎట్టకేలకి ఇవాళ సినిమా విడుదలైంది. మరి లాల్‌సింగ్ జర్నీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చిందా? వ్యతిరేకించినవారిని సైతం మెప్పించగలిగిందా? ఓసారి చూద్దాం.

కథేమిటంటే..

పంజాబ్‌లోని సిక్కు కుటుంబంలో జన్మించిన లాల్‌ సింగ్ చద్ధా (ఆమిర్) ఓ స్పెషల్ చైల్డ్. కానీ తల్లి (మోనా), తన ఫ్రెండ్ రూప (కరీనా)ల సాయంతో ఆ వైకల్యాన్ని అధిగమిస్తాడు. అన్నింట్లో ముందడుగు వేస్తాడు. పెద్దయ్యాక మిలిటరీలో చేరతాడు. అక్కడ అతని జీవితంలోకి బాలరాజు (నాగచైతన్య) వస్తాడు. అయితే మన అనుకున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా దూరమవుతుంటారు. ఆ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాటి నుంచి ఎలాంటి జీవిత సత్యాలు తెలుసుకున్నాడు, చివరికి ఏం చేశాడు అనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే..

ఒక సినిమాని రీమేక్ చేయాలనుకోవడం ఈజీనే. కానీ చేయడం అంత ఈజీ కాదు. ఉన్నదున్నట్టు తీస్తే కాపీ అంటారు. మార్చడానికి ట్రై చేస్తే పాడు చేశారంటారు. అందుకే ఇప్పుడు రీమేక్ చేయడం కత్తిమీద సాములా మారింది. అందులోనూ ‘ఫారెస్ట్ గంప్’ లాంటి క్లాసిక్ మూవీని మళ్లీ తీయాలనుకోవడం సాహసమే. కాకపోతే అందుకు రెడీ అయ్యింది మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ కనుక అందరూ పర్లేదులే అనుకున్నారు. ఏదో ఒక మేజిక్ జరుగుతుందని ఎదురు చూశారు. కానీ అలా జరగకపోవడం దురదృష్టం. నిజానికి ‘ఫారెస్ట్ గంప్’ కథ పెద్ద గొప్పదేమీ కాదు. కానీ టేకింగ్‌ కట్టి పడేసింది. ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకుల హృదయాలు దోచింది. ఒక వ్యక్తి జీవితంలోని దశల్ని అందంగా ఆవిష్కరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. అయితే ఇది పూర్తిగా విదేశీ కథ. దాన్ని మనకి తగ్గట్టు మార్చుకుంటే తప్ప మనవాళ్లు కనెక్ట్ కారు. అందుకే రైటర్ అతుల్ కులకర్ణి బాగా కష్టపడ్డాడు. ఎనభైల కాలంలో జరిగిన కథతో స్టార్ట్ చేసి.. వరల్డ్ కప్, స్వర్ణ దేవాలయంపై దాడి, ఎమర్జెనీ, సిక్కుల ఊచకోత లాంటి పలు వాస్తవిక అంశాలను టచ్ చేస్తూ పోయాడు. కొన్ని ఫన్నీ సీన్స్ని కూడా యాడ్ చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో ప్రేక్షకులకు రుచించని పొరపాట్లు చాలానే చేశాడు.
         
ఆడియెన్స్ సినిమా చూసే శైలి మారిపోయి చాలా కాలమయ్యింది. ముఖ్యంగా రియలిస్టిక్ అప్రోచ్‌ని వాళ్లు ఇష్టపడటం మొదలుపెట్టాక ఏ కాస్త అతి చేసినా తిప్పి కొడుతున్నారు. అది తెలిసి కూడా హీరో ఓ టెర్రరిస్టును కాపాడితే అతను మారిపోయి మంచివాడైపోవడం లాంటి సీన్స్ రాసుకున్నారంటే ఏమనాలి! పోనీ ఇలాంటివి వదిలేసినా.. అందరికీ కనెక్టయ్యే సీన్స్ అయినా ఉన్నాయా అంటే అదీ లేదు. ఏదో అప్పుడలా జరిగింది, ఇప్పుడిలా జరిగింది అని చెప్పుకుంటూ పోయినట్టు ఉంటే పుస్తకం చదివినట్టు ఉంటుంది తప్ప సినిమా చూసిన ఫీల్ కలగదు కదా. అందులోనూ ఓ వ్యక్తి జర్నీ అంటే ఎలా ఉండాలి! అది కూడా వైకల్యంతో పుట్టి, దాన్ని అధిగమించి ఎదిగినవాడి కథలో ఎంత ఎమోషన్ ఉండాలి! ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్గిల్ వార్‌‌ సీన్స్ని కూడా అంతంత మాత్రంగా తీయడం అతి పెద్ద డిజప్పాయింట్‌మెంట్. మొత్తంగా ఆశించిన క్వాలిటీస్ ఏవీ కనిపించకపోవడంతో ఇంటర్వెల్ సమయానికే సగం నీరసించిపోతాడు ప్రేక్షకుడు. ఏదో కాస్తో కూస్తో మిగిలున్న ఆశతో సెకెండాఫ్‌ కోసం కూర్చున్నా.. సినిమా పూర్తయ్యే సమయానికి పూర్తిగా డల్ అయిపోతాడు. మొత్తంగా అంత గొప్ప సినిమాని తీసుకొచ్చి మళ్లీ తీయకపోతే ఏం పోయింది అన్న భావనతో థియేటర్‌‌లోంచి బైటికి రావాల్సి వస్తుంది. 

ఎవరెలా నటించారంటే.. 

ఆమిర్ నటన గురించి మాట్లాడటమంటే డిక్షనరీ తయారుచేసిన వారికి భాష గురించి వివరించినట్టుంటుంది. పర్‌‌ఫార్మెన్స్లో ఆయన పర్‌‌ఫెక్షన్ గురించి అందరికీ తెలిసిందే. పాత్రని ఆకళింపు చేసేసుకుని, అవసరమైన భావోద్వేగాలను రంగరించి అదరగొట్టేయడం ఆమిర్ స్టైల్. అయితే గత చిత్రాల స్థాయిలో ఆయన నటన లేదనేది కాదనలేని వాస్తవం. కావాలనే ఆయన అలా నటించాడా లేక డైరెక్టర్ చెప్పింది చేయడం వల్ల తేడా కొట్టిందా అనే చిన్న కన్‌ఫ్యూజన్ సినిమా పూర్తయ్యేవరకు ఆడియెన్స్ని వెంటాడుతుంది. దంగల్, పీకే లాంటి సినిమాల్లోని ఆయన నటన గుర్తొచ్చి మరింత నిరాశ కలుగుతుంది. దానికి కారణం ఆయన ఆ పాత్రకి ఫిట్ కాకపోవడం, గతంలో ‘పీకే’లో చేసిన పాత్రలాగే ఈ క్యారెక్టర్ కూడా ఉండటం. సహజత్వానికి ప్యాంటూ షర్టూ వేసినట్టు కనిపించే ఆమిర్‌‌ని లాల్ సింగ్ పాత్ర కోసం కాస్త కృతకంగా తయారు చేశాడు దర్శకుడు. మానసికంగా ఎదగనివాడిగా చూపించే క్రమంలో ఆయన  కాస్త అతిగా నటించినట్టు కూడా అనిపిస్తుంది. దాంతో జాలి కలగకపోగా ఇంకా ఎంతసేపు ఇలాంటివి చూడాలో అనిపిస్తుంది. ఆమిర్ గురించి ఇలాంటి కామెంట్స్ బహుశా ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండం. ఎందుకంటే సినిమా ఫెయిలైనా యాక్టర్‌‌గా ఆమిర్ ఎప్పుడూ ఫెయిలవ్వడు. కానీ లాల్ సింగ్ విషయంలో ఇది జరిగింది కాబట్టి ఒప్పుకుని తీరాల్సిందే. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం అసలైన ఆమిర్ కనిపిస్తాడు. మనసును తాకుతాడు. కళ్లను తడుపుతాడు. కానీ అది పూర్తి స్థాయిలో ఉండుంటే బాగుండేది. సినిమా అంతా క్యారీ అయ్యుంటే కన్విన్స్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఆ చాన్స్ దొరకలేదు ప్రేక్షకులకి. ఇక రూప పాత్రలో కరీనా ఒదిగిపోయింది.

కానీ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ కాదు ఆమెది. బాలరాజు పాత్రకి న్యాయం చేయడానికి చైతు తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ అంతగా పండలేదు. ఒరిజినల్‌లోని క్యారెక్టర్ ప్రభావం అతనిపై పడిందేమో అనిపించక మానదు. అలా కాకుండా తనదైన స్టైల్లో ఫ్రీగా లాగించేసి ఉంటే తన కెరీర్‌‌లో ఇదో మంచి రోల్ అయ్యుండేది. తల్లి పాత్రలో మోనా సింగ్‌కి మార్కులు పడతాయి. ప్రతిష్టాత్మకమైన పాత్రేమీ కాదు గానీ..  బేసిగ్గానే మంచి నటి కావడంతో తనదైన శైలిలో చక్కగా చేసుకుంటూ పోయిందామె. మిగతావాళ్లంతా మామూలే. ఒకచోట షారుఖ్‌ ఎంట్రీ సర్‌‌ప్రైజింగ్‌గా అనిపించినా.. దానివల్ల సినిమాకి ఒరిగిందేమీ లేదు. 

ఇక టెక్నికల్ విషయాలకొస్తే..
 
ప్రీతమ్ అందించిన పాటలు బానే అనిపించినా, తనుజ్ టికూ ఇచ్చి బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అంతంతమాత్రంగా ఉంది. ఎమోషనల్ చిత్రాలకి ఈ రేంజ్ బీజీఎమ్ చాలదు. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది. సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాణ విలువల పరంగా వంక పెట్టడానికి వీల్లేదు. ఎటొచ్చీ కథ, కథనాలు, క్యారెక్టరయిజేషన్ల విషయంలోనే తేడా జరిగింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా సబ్జెక్టే పెద్ద సమస్య. ఎందుకంటే ఇది ఇప్పటి కాలానికి సరిపోయే కథ కాదు. ఎప్పుడో నైన్టీస్‌లో వచ్చిన సినిమాని ఇప్పటి ప్రేక్షకులకి చూపించి మెప్పించాలనుకోవడం పెద్ద రిస్క్. అయినా కూడా ఆమిర్ ఉన్నాడనే భరోసాతో ఉన్నారంతా. ఆ భరోసాని బద్దలుకొట్టడంలో అద్వైత్ చందన్ బాగా సక్సెస్ అయ్యాడు. అతుల్ నేరేషన్‌లోని లోపాల్ని అతను పట్టుకోలేకపోయాడు. ఇప్పటి కాలానికి, మన నేటివిటీకి తగ్గట్టు అడాప్ట్ చేయలేకపోయిన విషయాన్ని గమనించుకోకపోవడంతో పాటు ఇంప్రెసివ్‌గా తెరకెక్కించడంలోనూ అద్వైత్ తడబడటంతో లాల్‌సింగ్ జర్నీ బోరింగ్‌గా తయారయ్యింది. ‘ఫారెస్ట్ గంప్’ చూడనివాళ్లకి ఏ కాస్తయినా ఎక్కుతుందేమో కానీ.. సాధారణ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం ఈ సినిమాతో ఎంగేజ్ చేయడం కాస్త కష్టమే.

నటీనటులు: ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు

సంగీతం:  ప్రీతమ్, తనుజ్ టికు

నిర్మాణం:  ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారే

రచన: అతుల్ కులకర్ణి

దర్శకత్వం: అద్వైత్ చందన్

కొసమెరుపు: లాల్‌సింగ్ చద్ధా.. అడుగులు బాగా తడబడ్డాయి