
- రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూ పంచాయితీ
- ఇబ్బందులు పడుతున్న రెండు గ్రామాల రైతులు
సూర్యాపేట, వెలుగు : ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య భూ పంచాయితీ రైతులకు శాపంగా మారింది. రెండు గ్రామాల మధ్య సరిహద్దు వివాదంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నెమలిపురి, వజినేపల్లి గ్రామాల పరిధిలోని భూములపై రెండు శాఖల మధ్య ఏర్పడిన భూవివాదం కొలిక్కి రావడం లేదు. ఆ భూములు తమకే చెందుతాయని ఇరు శాఖలు వాదిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
120 ఎకరాలకు పట్టాలు..
చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలోని 52 సర్వే నంబర్‌లో 636 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నంబర్‌లో 1988లో కుటుంబ నియంత్రణ చేయించుకున్న 40 కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున 120 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూములకు సంబంధించి నాటి ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. ఇదే మండలం నెమలిపురి గ్రామ పరిధిలో 316 సర్వే నంబర్‌లో ఉన్న 1,360 ఎకరాల అగ్రహారం భూములను 1962లో అప్పటి సర్కారు ఫారెస్ట్ శాఖకు కేటాయించింది. ఈ సర్వే నంబర్ 316 నుంచి 318గా మార్చింది. అయితే రెండు గ్రామాల్లోన్ని సర్వే నంబర్లు పక్కపక్కనే ఉండడంతో సరిహద్దు వివాదం మొదలైంది.
ఇదీ వివాదం..
నెమలిపురిలోని 318 సర్వే నంబర్‌లో రికార్డుల్లో చూపిన 1,360 ఎకరాల భూమికి క్షేత్రస్థాయిలో 120 ఎకరాలు తక్కువగా ఉంది. దీంతో ఫారెస్ట్ అధికారులు వజినేపల్లిలో సర్వే నంబర్ 52లోని రెవెన్యూ భూములను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో సమస్య మొదలైంది. అప్పటి నుంచి ఈ సర్వే నంబర్‌లో పట్టాలు పొందిన రైతులను ఈ భూమిలోకి రానివ్వడం లేదు. నెమలిపురిలోని సర్వే నంబర్ 316లో ఎంత భూమి ఉందో క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండానే అటవీశాఖకు అప్పటి ప్రభుత్వం కేటాయించడంతో ఈ వివాదం వచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు రెండు గ్రామాల సరిహద్దులను ఓవర్ లాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.