కోహెడలో భగ్గుమన్న భూ వివాదం.. ప్లాట్స్ ఓనర్లపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగిన మరో వర్గం

కోహెడలో భగ్గుమన్న భూ వివాదం.. ప్లాట్స్ ఓనర్లపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగిన మరో వర్గం

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో భూ వివాదం భగ్గుమంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 951, 952 లో 7.28 ఎకరాల భూమి ఉంది.1970లో భూ యజమానులైన కంగుల రాములు, కంగుల పోచయ్య మరికొంత మంది కుటుంబ సభ్యులు కలిసి కంగుల గండయ్య, ఈదయ్యకు సాధారణ పవర్ అటార్నీ(జీపీఏ) ఇచ్చారు. 

దీంతో అదే ఏడాది గండయ్య, ఈదయ్య కలిసి ఈ భూమిలో వెంచర్ వేసి,170 ప్లాట్ లను పలువురికి విక్రయించారు. ఇది జరిగిన కొన్నేండ్ల తర్వాత తమ కుటుంబ సభ్యులు మొదట ఇచ్చిన జీపీఏ చట్టబద్ధమైనది కాదని, ఈ భూమిని 2013 సంరెడ్డి బాల్ రెడ్డికి సదరు కుటుంబసభ్యులు విక్రయించారు. అప్పట్నుంచి ప్లాట్స్ ఓనర్స్, సంరెడ్డి బాల్ రెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ భూమిలో సంరెడ్డి బాల్ రెడ్డి ఓ ఫామ్ హౌజ్ నిర్మిస్తుండగా, గత ఫిబ్రవరిలో ప్లాట్స్ ఓనర్స్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ఫామ్​హౌజ్​ను హైడ్రా అధికారులు కొంత భాగాన్ని కూల్చివేశారు. 

దీంతో బాల్ రెడ్డి హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. పోలీసులు, హైడ్రా అధికారులు ఆ భూమిలోకి వెళ్లకుండా నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్​ను గత ఫిబ్రవరిలో బాల్ రెడ్డి తీసుకువచ్చాడు. అయితే, మార్చి 28న ప్లాట్స్ ఓనర్స్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి అనుకూలంగా డిక్రీ రావడంతో వారు ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు గురువారం అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్లాట్స్ ఓనర్స్ పై బాల్ రెడ్డి వర్గీయులు కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేశాడు. 

ఈ ఘర్షణలో ప్లాట్ ఓనర్ సత్యనారాయణ తలకు తీవ్రంగా, నవీన్, వెంకట్ అనే ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి.  దీంతో ప్లాట్స్ ఓనర్స్ హయత్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తమకు కూడా గాయాలు అయినట్లు బాల్ రెడ్డి పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఉండగా, తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్స్ లలో ఇలా ఆక్రమదారులు నిర్మాణాలు చేస్తున్నారని ప్లాట్స్ ఓనర్స్ ఆరోపించారు. పోలీసులు బాల్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.