రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయండి

రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయండి
  • యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బాధితుల ఆందోళన

యాదగిరిగుట్ట, వెలుగు : తమకు అమ్మిన భూమిని అక్రమంగా మరొకరికి అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకుని బాధితులు డిమాండ్​చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన బీబీనగరం మాతయ్య, బీబీనగరం ప్రమీల తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితుల వివరాల ప్రకారం.. కాచారం గ్రామానికి చెందిన వంగపల్లి వెంకటయ్య 2.20 ఎకరాల భూమిని బీబీనగరం మల్లయ్యకు 1979లో  అమ్మాడు. 

ఆ భూమి మల్లయ్య పేరిట పాస్ బుక్ లో సైతం నమోదు అయింది. అప్పటి నుంచి నేటి వరకు బీబీనగరం మల్లయ్య కుటుంబ సభ్యులు కబ్జాలో ఉన్నారు. ఈ క్రమంలో రికార్డులు తారుమారై వంగపల్లి వెంకటయ్య కుమారులైన వంగపల్లి రమణయ్య, విఠోభా పేర్లపై భూమి నమోదైంది. దీంతో బీబీనగరం మల్లయ్య వారసులైన మాతయ్య, ప్రమీలు రెవెన్యూ అధికారులను ఆశ్రయించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని కోరారు. గతంలో, భూభారతి చట్టం వచ్చాక కూడా సాదాబైనామా కింద దరఖాస్తు చేశారు. 

ఈ క్రమంలో వంగపల్లి వెంకటయ్య కుమారులు రమణయ్య, విఠోభా కలిసి ఆ 2.20 ఎకరాల భూమిని వేరేచోట చూపించి వేరేవాళ్లకు మళ్లీ అమ్మారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న బీబీనగరం మల్లయ్య వారసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ గణేశ్​నాయక్  ను కలిసి వినతిపత్రం అందజేశారు.