
రంగారెడ్డి జిల్లా, వెలుగు: సొమ్మొకడిది.. సోకొకడిది అన్న చందంగా ఉంది భూ పట్టాలపరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నూతనం చేపట్టిన భూ సర్వేతో ప్రతి పట్టాదారుడికి ఓ నెంబర్‌ను కేటాయించింది. ఆ నెంబర్ ఒక్కరికే పరిమితం అవుతుంది. సర్వే నెంబర్ ఒక్కటే అయినప్పటికీ ఆ భూమిలో పట్టాదారులు వేరు వేరుగా ఉన్నప్పుడు పట్టాదారులందరికీ వేర్వేరు ఖాతా నెంబర్లు కేటాయించిన ప్రభుత్వం అందరికీ పట్టా పాసుపుస్తకాలు అందజేసింది. అంతే కాకుండా వివాదాలున్న భూముల పట్టాలను నిలిపివేసింది. కోర్టు కేసుల్లో, క్రయ విక్రయాల్లో వచ్చిన విభేదాలు, కుటుంబాల మధ్య ఉన్న వైరుధ్యాలున్నంటువంటి భూములను రెవెన్యూ యంత్రాంగం ముట్టుకోలేదు. ఒక వేళ వివాదాలున్నా భూములు పట్టా చేయాలంటే ఆ వ్యక్తుల మధ్య సఖ్యత ఉన్నట్లు స్థానిక తహశీల్దార్, వీఆర్‌వోల సమక్షంలో ఒప్పంద పత్రాలు, అఫిడివిట్లు తీసుకొస్తే చేస్తున్నారు. కానీ యాచారం మండలం తహశీల్దార్ ఎటువంటి ఆధారాలు లేకుండానే ఒకే ఖాతా నెంబర్ పై మరొకరికి భూమి ఉన్నట్లు పట్టా చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన పి.శివరెడ్డి ఖాతా నెంబర్ 60130, సర్వే నెంబర్ 83/1/3/2లో 20 గుంటల భూమి కలదు. ఈ భూమి మొదటి యాజమాని బొమ్మిడిక మధుకర్ రెడ్డికి చెందినది. అయితే మధుకర్ రెడ్డి 2005 డిసెంబర్‌లో వి.శివస్వామికి అమ్మేశాడు. ఆ తర్వాత శివస్వామి 2016 అక్టోబర్‌లో పి.శివరెడ్డికి అమ్మేశారు. అయితే ఇప్పటికి భూమిపై శివరెడ్డికే యాజమాన్య హక్కులున్నట్లు ప్రభుత్వ రికార్డు చేబుతుంది. దీని ఆధారంగానే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసు పుస్తకం, ఖాతా నెంబర్ కేటాయించారు. అయితే స్థానిక తహశీల్దార్ ఖాతా నెంబర్‌ను మార్చకుండా 83/1/1 సర్వే నెంబర్‌గా 17 గుంటల భూమికి కుదించి మార్పులు చేస్తూ పి.శివరెడ్డి భూమిని బి.శ్రీకాంత్ రెడ్డి (మధుకర్‌రెడ్డి)లకు అమ్మినట్లు నమోదు చేశారు. ఈ విషయంపై తహశీల్దార్ పుష్పలతను ఫోన్‌లో సంప్రదించగా.. అదే భూమిలో కొంత స్థలం ఉంది. పి.శివరెడ్డి భూమితో శ్రీకాంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. మొదటి యజమానికి 37 గుంటల భూమి ఉండాలిగా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది. ఆర్డీవోను ఫోన్సంప్రదిస్తే ఒక ఖాతా నెంబర్ ఇద్దరికి ఉంటే తప్పు జరిగినట్లేనని తెలిపారు.
మా భూమి కాజేసే కుట్ర
నా సర్వే నెంబర్‌లోని భూమిని మరొకరికి ఏవిధంగా పట్టా చేస్తారని ఎమ్మార్వోని అడిగితే అది నీ భూమిని కాదంటున్నారు. ఇద్దరికీ ఒకే ఖాతా నెంబర్ ఉన్నాయని అడిగితే.. అందరికి ఒకే నెంబర్ ఉంటుందని చెప్పింది. మేము ఎవరికీ భూమి అమ్మలేదు. అనుమానం వచ్చి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశాను. సదురు వ్యక్తితో ఒప్పందం చేసుకొని మా భూములు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు.
– పి.శివరెడ్డి, రైతు