- కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు
ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నకిలీ పాసు పుస్తకాలు ఉదంతం కలకలం రేపుతోంది. ఈ అంశంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మండలంలోని సర్వే నంబర్597లో ఎంఎస్సీ ఫారం గ్రామానికి చెందిన భగవతి కర్ణకు 5.20 ఎకరాలు, 599 సర్వే నంబర్లో 5.13 ఎకరాల భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఆర్ కే మూర్తనకు సర్వే నంబర్ 598లో 6.19 ఎకరాలు ఉంది. వీరు ముంబయి, లండన్ లో స్థిరపడగా.. ఇదే గ్రామానికి చెందిన ఎండీ అంకూస్ఆ భూములకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నిగా వ్యవహరిస్తున్నారు. ఆ భూములను 2021 నుంచి 2026 వరకు ఎడపల్లికి చెందిన కరుటూరి రామకృష్ణ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. ఈ రబీ సీజన్‌తో కౌలు గడువు ముగియడంతో ఇతరులకు కౌలుకిచ్చేందుకు అంకూస్ఒప్పందం చేసుకున్నాడు. అయితే సర్వే నంబర్ 597, సర్వే నంబర్598లోని భూములను తాను కొనుగోలు చేశానని, 2005 నుంచే సాగుచేస్తున్నానని రామకృష్ణ ఎదురు తిరిగాడు.
తన భార్య గంగాభవాని, తన పేర ఉన్న సాదాబైనామా పత్రం, పట్టాదారు పాసు పుస్తకాలు చూపడంతో అంకూస్ ఖంగుతిన్నాడు. రామకృష్ణ చూపుతున్న పత్రాలన్నీ నకిలీవేని, ఫోర్జరీ సంతకాలతో సృష్టించాడని పేర్కొంటూ కలెక్టర్‌కు, ఎడపల్లి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను 2021లో రామకృష్ణకు కౌలుకిస్తే 2005లో పొందినట్టుగా పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించాడని, 25 ఏండ్లుగా పట్టాదారులు స్వగ్రామానికి రాలేదని, పట్టా మార్పిడి జరగలేదని, నేటికీ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుల పేర్లపైనే ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్పూర్తి విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పోలీసులు సైతం విచారణ జరుపుతున్నారు.
