
- 100 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్
- హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో భూములు కోసం అన్వేషణ
- భూములు దొరక్కపోవడంతో అధికారుల సతమతం
- మేళ్లచెరువులో ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్
సూర్యాపేట, వెలుగు : హుజూర్ నగర్ నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అధికారులు స్థలాన్ని సేకరిస్తున్నారు. హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో స్థలం కోసం అధికారులు ప్రపోజల్స్ సిద్ధం చేశారు. అయితే 100 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ భూములైనా సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల హుజూర్ నగర్ మండలం మఠంపల్లి రోడ్డు సమీపంలో ఉన్న మగ్దూంనగర్, ఎర్రగట్టు ప్రాంతాల మధ్య ఉన్న ప్రభుత్వ భూమిలో యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మేళ్లచెరువు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1057లో నిరుపయోగంగా ఉన్న 156 ఎకరాల భూదాన్ భూముల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.
హుజూర్నగర్ కు యూనివర్సిటీ..
మార్చి 30న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ యూనివర్సిటీ మంజూరు చేశారు. అయితే ఈ యూనివర్సిటీకి 100 ఎకరాల భూమి అవసరమని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలుత యూనివర్సిటీ కాలేజీని హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో గల దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి రైతులు, దేవాదాయశాఖ వారు ఒప్పుకోకపోవడంతో అధికారులు మరోచోట ఈ కాలేజీ ఏర్పాటు చేయాలని అధికారులు చూస్తున్నారు. అయితే గతంలో బూరుగడ్డ ప్రాంతంలోని 604 సర్వే నంబర్ లో 164 ఎకరాలు ఉండగా, ఆ స్థలం అనుకూలంగా లేకపోవడంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.
ఈ క్రమంలోనే ఇటీవల మగ్దూంనగర్ లోని 1041 సర్వే నంబర్ లోని 273 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా, ఆ స్థలంలో యూనివర్సిటీ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల్లో స్థలం కావాలంటూ ప్రకటన చేశారు. ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రైవేట్ స్థలంలోనైనా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
హద్దు.. బద్దులతో ఖాళీగా భూమి..
వ్యవసాయానికి అనుకూలమైనప్పటికీ ఈ భూమి ప్రభుత్వ భూమి కావడంతో ప్రస్తుతం ఎలాంటి సాగు చేపట్టడం లేదు. ఖాళీగా ఉన్న ఈ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని గతంలో స్థానిక సిమెంట్ పరిశ్రమలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ భూములను లీజుకు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిపై పూర్తిస్థాయిలో సర్వే చేసి 150 ఎకరాల భూమికి హద్దులు నిర్వహించి ధరణిలో భూదాన్ భూములుగా నమోదు చేశారు. ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ భూములను ప్రజాప్రయోజనం కోసం వినియోగించడం వల్ల భూములు దానం చేసిన వారికి ఫలితం తగ్గుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పరిహారం అవసరం లేకుండా భూమి..
వ్యవసాయ యూనివర్సిటీకి 100 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే ఎకరాకు తగిన నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మేళ్లచెరువులోని సర్వే నంబర్ 1057లో గల భూదాన్ భూముల్లో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి భూసేకరణ, భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ భూముల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు.
మేళ్లచెర్వులో ఏర్పాటు చేయాలని డిమాండ్..
మేళ్లచెర్వులో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రైతులు, స్థానిక యువత నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మేళ్లచెరువు మండల కేంద్రంలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుగుణంగా 150 ఎకరాల భూదాన్ భూమి ఉందని, ఈ భూముల్లో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమైన అంశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1057లో 150 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఈ భూమిని ఆనుకుని గుండ్లపల్లి మేజర్ కాల్వ, ముత్యాల బ్రాంచ్ మెయిన్ కెనాల్ ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఈ భూముల వద్ద గుండ్లపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ప్రారంభమవుతాయి. హుజూర్నగర్ బైపాస్ రోడ్డుకు దగ్గరలో ఉంది. మేళ్లచెరువు మండల కేంద్రంలో రైల్వే లైన్ కూడా ఈ భూములకు దగ్గరలో ఉన్నాయి.
అనుకూలమైన అంశాలను పరిశీలిస్తున్నాం
రెండు మూడు చోట్ల వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అభ్యర్థనలు వచ్చాయి. నీళ్ల సౌకర్యం, రాకపోకలకు అనువైన ప్రదేశం కోసం చూస్తున్నాం. మేళ్లచెరువులో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైతులు కోరారు. ఆ భూములను పరిశీలిస్తున్నాం.
శ్రీనివాసులు, ఆర్డీవో హుజూర్నగర్