నల్లగొండ జిల్లా గ్రౌండ్ వాటర్ లో దాగిన ఆనవాళ్లు

నల్లగొండ జిల్లా గ్రౌండ్ వాటర్ లో దాగిన ఆనవాళ్లు
  • నాలుగు మండలాల్లోని 43 గ్రామాల్లో స్వచ్ఛంద సంస్థ నీటి పరీక్షలు 
  • దాదాపు అన్ని ఊర్లలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ లెవెల్స్  
  • మిషన్​ భగీరథ నీళ్లు రానప్పుడు బోరు నీళ్లపై ఆధారపడుతున్న ప్రజలు
  • కేవలం తాగునీటితోనే పరిష్కారం కాదంటున్న సైంటిస్టులు
  • సాగునీటి సమస్య తీరితేనే లక్ష్యం నెరవేతుందని స్పష్టీకరణ

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ పీడ వదిలిపెట్టడం లేదు. జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నా ఫ్లోరైడ్ మాహమ్మారి నుంచి మాత్రం విముక్తి కలగడం లేదు. భూగర్భ జలాల్లో దాగిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. తలాపునే కృష్ణానది ప్రవహిస్తున్నా తాగునీటి అవసరాలు మాత్రమే తీరుస్తుండడంతో ఫ్లోరైడ్ బారిన పడ్డ ప్రాంతాలు ఆ నీటితోనే పంటలు పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రక్షిత తాగునీటితో పాటు, సాగునీరు అందించినప్పుడు మాత్రమే ఫ్లోరైడ్ నిర్మూలన సాధ్యమవుతుందని, తాగునీటితో కేవలం 10 శాతం మాత్రమే సమస్య తీరుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. 90 శాతం పంటలను ఉపరితల జలాలతో పండించినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. 

43 గ్రామాల్లో పరీక్షలు 

మిషన్ భగీరథ నీళ్లతో నల్గగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా తొలగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది తప్పా భూగర్భ జలాలపైన దృష్టి పెట్టడం లేదు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫ్లోరైడ్ సమస్యపై ప్రధాన రాజకీయ పక్షాలు ప్రభుత్వ తీరుపైన దుమ్మెత్తిపోశాయి. తాజాగా మునుగోడులో ఇన్రిమ్ అనే స్వచ్ఛంద సంస్థ మైక్రో న్యూట్రీషన్ మీద రీసెర్చ్ చేసింది. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ మోతాదు ఏ స్థాయితో ఉందో తెలుసుకునేందుకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే పరీక్షలు జరిపింది. ఐదు నెలల కింద మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడ, మునుగోడు, చండూరు మండలాల్లోని 43 గ్రామాల్లోని బోరుబావుల్లో నీటి శాంపిళ్లు సేకరించారు. జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్​డబ్ల్యూఎస్​) ల్యాబ్ లో పరీక్షించగా ఎక్కువ గ్రామాల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా  ఉందని తేలింది. 

39 గ్రామాల్లో మోతాదుకు మించి పీపీఎం

డబ్ల్యూహెచ్ఓ గైడ్​లైన్స్​ ప్రకారం నీళ్లలో ఫ్లోరైడ్ పర్సంటేజీ 1.5 పీపీఎం కంటే మించి ఉండొద్దు. కానీ 43 గ్రామాల్లోని పంచాయతీ బోర్లలో 1.35 నుంచి 7.35 పీపీఎం వరకు ఉన్నట్టు తేలింది. మర్రిగూడ మండలం సరంపేటలో 7.35 పీపీఎం, నాంపల్లి మండలం లింగోటంలో 6.82, నర్సింహాపురంలో 5.54 , చండూరు మండలం తేరటుపల్లిలో 2.40 పీపీఎం ఉన్నట్టు తేలింది.  ఇలా దాదాపు 40 గ్రామాల్లో  పీపీఎం లెవెల్స్​అనుకున్న పర్సంటేజీకి మించి ఉన్నాయి. నాంపల్లి మండలం చలవాని కుంటలో 1.35 పీపీఎం, చండూరు మండలం బోడంగిపర్తిలో 1.32 , ఇదే మండలం కొండాపురంలో 1.25,  పుల్మెంలలో1.20 పీపీఎం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.  

మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే బోరు నీళ్లే గతి..

మిషన్ భగీరథ నీళ్లు నిరంతరంగా సప్లై చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నా గ్రామాల్లో మాత్రం రెండు రోజులకోసారి వస్తున్నాయని జనాలు అంటున్నారు. కొన్ని చోట్ల భగీరథ నీళ్ల సప్లై కోసం పాత పైపులైన్లు, బోరుబావులనే ఇంకా వాడుతున్నారు. నిజానికి ప్రభుత్వం మిషన్​ భగీరథ స్కీం వచ్చాక పాత బోర్లను వాడొద్దని చెప్పింది. కానీ భగీరథ నీళ్లు సరఫరా లేని రోజుల్లో ప్రత్యామ్నయంగా పంచాయతీ బోర్ల నుంచే ఇండ్లకు నీళ్లను సప్లై చేస్తున్నారు. కాకపోతే వీటిని తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తాగడానికి జనాలు ఇప్పటికీ ప్రైవేటు మినరల్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నారు. లేదంటే ఇండ్లలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకుని తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.  

సాగునీటి ప్రాజెక్టులే శరణ్యం..

ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే తప్పా ఫ్లోరైడ్ సమస్య తీరదని సైంటిస్టులు చెప్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఏడేండ్ల కింద చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి, తెలంగాణ డెవలప్​మెంట్​ఫోరం ఎన్నో ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నాయి. డిండిలో భాగంగా మునుగోడులో నిర్మిస్తున్న శివన్నగూడెం, కిష్టరాయిపల్లి రిజర్వాయర్లతో పాటు, మూసీ నీటిని చౌటప్పుల్, నారాయణపురం మండలాలకు తరలిస్తే తప్పా ఫ్లోరైడ్ నుంచి విముక్తి లభించదని తెలంగాణ డెవలప్​మెంట్​ఫోరం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.  

రెండు రోజులకోసారి భగీరథ నీళ్లు  

మిషన్ భగీరథ నీళ్లు రెండు రోజులకోసారి వస్తున్నయ్. అవి రానప్పుడు పంచాయతీ బోర్ల నుంచి వచ్చే నీళ్లను ఇతర అవసరాలకు వాడుకుంటున్నాం. ఇందులో ఉండే ఫ్లోరైడ్​తో సమస్యలు తప్పడం లేదు. కాళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు వస్తున్నయ్. 

-  ఆకారపు సరోజ, 
 ఎస్సీ కాలనీ,  మునుగోడు

పంటల పై ప్రభావం  

మా గ్రామ పంచాయతీలో రోజు తప్పించి రోజు భగీరథ వాటర్ సప్లై చేస్తున్నాం. క్యాన్లలో పట్టుకుని స్టోర్ చేసుకుంటున్నం. రెండు, మూడు రోజల పాటు రాకపోతే బోరు నీటిని వాడుతున్నాం. తాగడానికి కాకుండా వాడకానికి మాత్రమే బోరునీటిని వినియోగించుకోవాలని చెప్తున్నాం. ఫ్లోరోసిస్ వల్ల బోరు బావుల నీళ్లు కలుషితమై ఉప్పుగా వస్తున్నాయి. పంటల దిగుబడి కూడా తక్కువగా వస్తోంది. 

- పగిళ్ల బిక్షం, సర్పంచ్ కల్వకుంట్ల