భద్రాచలంలో ఆనాటి ఆనవాళ్లు

భద్రాచలంలో ఆనాటి ఆనవాళ్లు

దక్షిణ భారత దేశంలో పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధ దివ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామక్షేత్రం. త్రేతాయుగంలో దండకారణ్యంలో వనవాసం చేస్తూ సీతారాములు విహార సమయంలో ఒక శిలపై కూర్చుంటారు. ఆ శిలనే మేరు దేవి, పర్వతరాజు దంపతులకు భద్రుడు పేరుతో పుత్రునిగా జన్మిస్తాడు. నారద మహర్షి ద్వారా భద్రుడు ‘శ్రీరామ తారక మంత్రం’ ఉపదేశం పొంది శ్రీరామ సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. తప ప్రభావంతో శ్రీమన్నారాయణుడు మళ్లీ శ్రీరామరూపం దాల్చి చతుర్భుజ రామునిగా శంఖ, చక్ర, ధనుర్భాణాలతో ప్రత్యక్షమయ్యాడు. భద్రమహర్షి కోరిక మేరకు పర్వతరూపంగా మారి అతని శిరస్సుపై పాదముద్రలు ఉంచి, గోదావరి నదికి అభిముఖంగా ఆయన హృదయంలో స్వామి వెలిశాడు.

కలియుగంలో రాముడు కనిపించాడని నమ్మే అరుదైన గాథకు భద్రాచలం కేంద్రం. దక్షిణాది అయోధ్య భద్రాచలం. భద్రుడు అచల(కొండ)మై ఉన్నందున భద్రాచలం అనే పేరు వచ్చింది. మహాభక్తులైన తిరుమంగై ఆళ్వార్, శంకర భగవత్పాదులు ఈ స్వామిని సేవించారు.16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే భక్తురాలు తాటాకులతో పందిరి వేసి, పూజలు చేసి, తాటిపండ్లను నివేదన చేసింది. తర్వాత భక్తరామదాసు ఆలయాన్ని నిర్మించి, తమ కీర్తనలతో వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి గాంచారు. ఆయన తర్వాత తూము లక్ష్మీ నర్సింహదాసు, వరద రామదాసులు కూడా స్వామి సేవలో గడిపారు.

వైకుంఠ రాముడు

సీతారామచంద్రస్వామి వైకుంఠ రాముడు. అన్ని ఉత్సవాలు, భోగ భాగ్యాలతో అలరారే స్వామికి ‘భోగరాముడు’ అనే పేరు కూడా ఉంది. చతుర్భుజుడు రామయ్య ఇక్కడ భద్రుని కొండపై వెలసినట్లుగా చరిత్ర చెప్తోంది. బ్రహ్మ దేవతలు, నారద మహర్షులు, తిరుమంగై ఆళ్వార్లు, ఆదిశంకరాచార్య తత్వవేత్తలు, రామదాసు వంటి వాగ్గేయకారులు ఎందరో రాముడిని సేవించి తరించారు. భక్తరామదాసు వల్ల ఈ ఆలయం పేరుప్రఖ్యాతులు గడించింది.

భద్ర మహర్షి తపస్సుకు మెచ్చిన రాముడు నేరుగా వైకుంఠం నుంచి శంఖుచక్రాలు ధరించి భద్రుని కొండపై కొలువుదీరాడు! పంచారామ క్షేత్రాల్లో ఇది మొదటిది.
రామాయణంలో  పంచవటిగా వ్యవహరించిన ప్రాంతం ఇది. రామాయణంలో ముఖ్య ఘట్టాలు జరిగిన ప్రాంతమిదే. సీతారామలక్ష్మణులు తమ వనవాస కాలంలో ఎక్కువ రోజులు(11 మాసాల 10 రోజులు) నివాసం ఉన్న పర్ణశాల ఇదే.

సీతారామలక్ష్మణుల వనవాస కాలంలో ఆనాడు పర్ణశాలను నిర్మించుకున్నారనే ప్రాంతంలోనే ఇప్పుడు వర్ణ కుటీరం ఉంది. సీతమ్మ పసుపు కుంకుమలుగా వాడుకున్న పసుపు, కుంకుమ రాళ్లు, నారచీరలు ఆరేసుకున్న చారబండలు, సీతారాములు ఆడుకున్న వామన గుంటలు, కందమూలాలను ఆరగించిన రాతి కంచాలు, సీతమ్మ ప్రత్యేక దినాల్లో స్నానమాచరించిన పద్మ సరస్సు(ఇప్పటి సీతవాగు), ఆమెకు రక్షణగా రాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుర్తులన్నీ నాటి రామాయణ కథను మళ్లీ మన కళ్ల ముందు ఉంచుతాయి. 

గోదావరి–శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న  ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీ తీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండకే రామగిరి అని పేరు(ప్రస్తుతం ఇది ఆంధ్రాలో విలీనమైనది).ఈ కొండపై రాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస వ్రతాన్ని చేశాడని స్థల పురాణం. ఈ కొండపై రాముడు యోగం చేయడం వల్ల ఇక్కడి రాముడిని యోగరాముడిగా పిలుస్తారు. జటావల్కలధారిగా ఉండే ఈ స్వామికి  

‘సుందరరాముడు’ అని కూడా పేరు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రామలక్ష్మణస్వామి అంజలి ఘటిస్తూ ఉంటాడు. పూర్వం ఈ కొండ మీద రామలక్ష్మణుల రెండు విగ్రహాలే ఉండేవి. తర్వాతి కాలంలో మాతంగి మహర్షి వంశీయులైన మహర్షులు సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్థల చరిత్ర. రాముడు ఇక్కడి నుంచి లంకకు వెళ్లడం వల్ల ఇక్కడి రాముడిని మహర్షులు దక్షిణాది ముఖాన ప్రతిష్ఠించారు.

పాపాలు తొలగించే ఉష్ణగుండాలు

వనవాసం చేసేటప్పుడు ఉష్ణ గుండాల ప్రాంతంలో సీతా, లక్ష్మణ సమేతుడై రాముడు నడిచాడు. సీతమ్మ వారు స్నానం ఆచరించడానికి లక్ష్మణుడిని వేడి నీళ్ల కోసం అడిగింది. ఒక్క బాణంతో నీళ్లను  లక్ష్మణ స్వామి భూమి పైకి తీసుకొచ్చారు. వీటితోనే అమ్మవారు స్నానమాచరించారని గుండాల గ్రామానికి చెందిన భక్తులు చెప్పుకుంటారు. ఇక్కడ ఒక్క చోట మాత్రమే నీళ్లు వేడిగా ఉంటాయి. భద్రాచలం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో గుండాల అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి పేరు కూడా ఉష్ణగుండాల వల్లే వచ్చింది.

బ్రహ్మోత్సవాలప్పుడు భక్తులంతా వేలాదిగా ఈ ఉష్ణగుండాలను చూసేందుకు వస్తుంటారు. ఉబికి వచ్చే వేడి నీళ్లని తీసుకుని నెత్తిమీద చల్లుకుంటారు. పురాతన కాలం నుంచిఈ ఉష్ణగుండాలకు విశేష  ప్రాచుర్యం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలప్పుడు ఇసుక తిన్నెల్లో బావిని తవ్వుతారు. ఈ ఉత్సవాలప్పుడు భక్తుల కోసం గుండాల గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది.

సుదర్శన చక్రం

భద్రాచలం కోవెల శిఖరం, దానిపై ఉన్న సుదర్శన పెరుమాళ్. పైన ఉన్న సుదర్శన చక్రం మనుషులు తయారు చేసింది కాదు! అది దేవతా నిర్మితం. దేవాలయం నిర్మించేటప్పుడు రామదాసుని నిధుల దుర్వినియోగం పేరిట కారాగారంలో బంధిస్తారు. దాంతో ఆలయం నిర్మాణం అంతా పూర్తైపోయి చివరి భాగం అయిన సుదర్శన చక్ర స్థానం ఖాళీగా ఉండిపోయింది. 

రామదాసు కారాగారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది సన్నగా గాలి వీచినా, వర్షం పడినా కింద పడిపోయేది. అక్కడ ఉన్నవాళ్లకు కలశం అలా పడిపోవడం అపచారంగా అనిపించేది. ఈ విషయం కారాగారంలో ఉన్న రామదాసుకు కూడా చేరింది. దాంతో ఆయన అన్నపానాదులు మానేశాడు. అంతెందుకు కారాగారం నుండి బయటకు వచ్చాక కూడా ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాడు ఆయన.

ఒక రోజు రామదాసుకు కలలో రాముడు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరంపై పెట్టవలసిన సుదర్శన చక్రం గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యారు. రామదాసు తెల్లవారుజామున అందరికీ ఆ విషయం చెప్పి గోదావరిలో స్నానానికి వెళ్తాడు. నీళ్లలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తేలియాడుతూ దొరుకుతుంది.

ఆనందంతో వేద మంత్రాలతో అదే రోజు ఆలయ శిఖరం పై దానిని ప్రతిష్ఠ చేశారు. ఆ తరువాత నుంచి శిఖరానికి అపశృతి అన్నమాట లేదు. ఈ విషయం గోల్కొండ సుల్తాన్​ తానీషాకి తెలిసి ఆయన కూడా సీతారాములని దర్శించుకుని, కానుకలు –మొక్కులు చెల్లించి రామదాసుని బంధించినందుకు మాఫీ కోరి వెళ్లాడట. అప్పుడు ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. 

సన్యాసి పరోపకారి జ్ఞాపకం

ఒకప్పుడు భద్రాచలం ప్రయాణం అంటే కష్టంగా ఉండేది. దాదాపు వందేండ్ల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. దాంతో రామదర్శనం కోసం వచ్చే భక్తులకు ఏదైన సాయం చేయాలన్న ఆలోచన వచ్చింది పమిడిఘంటం వెంకట రమణ దాసుకి. ఆస్తిపాస్తులు లేని ఆయన నిత్యాన్నదానం చేయాలన్న సంకల్పంతో ఇల్లిల్లు తిరిగి దానం అడిగేవాడు. వచ్చిన వాటితో వేడి అన్నం, పప్పు లేదా పచ్చడి చేసి మజ్జిగతో అన్న ప్రసాదాన్ని తయారుచేసేవాడు. వచ్చిన భక్తులకి లేదనకుండా అన్నం పెట్టేవాడు.అలా ఆహారాన్ని అందించే

ఈ ‘‘అంబ సత్రం’’ భద్రాచలంలో ఉన్న రామాలయం లాగానే ప్రసిద్ధి. ఈ సత్రం ఆలయ పరిసరాల్లోనే ఉంది. ఒక చిన్న ప్రారంభం పెద్ద విజయంగా మారింది. ఆ మహానుభావుడు ఏమీ ఆశించకుండా సన్యాసి జీవితాన్ని గడిపాడు. కష్ట సమయాల్లో అతను ఎలా సాయం చేసాడనే దాని గురించి అనేక కథనాలు ఉన్నాయి. 

ఒకనాడు ఆయన ఏర్పాటు చేసిన అంబ సత్రంలో వంటపాత్రలను ఎవరో ఎత్తుకు పోయారు. వేరే వంటపాత్రలు లేక వంటచేసేవాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో అంతా రాముడే చూసుకుంటాడని, రాముడిపై భారం వేసి నిబ్బరంగా ఉన్నాడు. అప్పుడు ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి ‘‘మేము వంటవాళ్ళం. వంట చేసేందుకు మా దగ్గర రెండు గుండిగలు ఉన్నాయి. ఈ రోజు వంట మేం చేస్తాం” అని వంట మొదలుపెట్టి వంట పూర్తి చేసారు.

‘కమ్మటి వాసన, చక్కటి రుచులతో రోజుటికంటే గొప్పగా ఉన్నాయం’టూ భక్తులు లొట్టలు వేస్తూ తిన్నారట. ఆ తరువాత ఎంత వెతికినా ఆ కుర్రవాళ్ల ఆచూకి తెలియలేదు. వాళ్ళని గతంలో ఎవరూ చూడలేదు కూడా. గోపన్నను విడిపించేందుకు తానీషాకు మాడలు చెల్లించిన అన్నదమ్ములు రామలక్ష్మణులే...  ఇప్పుడు ఈ అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించారు అనుకున్నారంతా. 

భక్తులు అంతకంతకూ పెరగడంతో యాచించింది సరిపోక ‘‘నువ్వే దిక్క’’ని రాముణ్ని ప్రార్ధిస్తే ఒక ధనవంతుడు వచ్చి ‘‘మా అమ్మ కలలో కనిపించి మీ సత్రానికి తన భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నాలుగు వేల ఎకరాలు మీకు రాసిస్తున్నా” అని అందుకు సంబంధించిన పత్రాలు ఇచ్చేశాడు. ఆ ధనవంతుడు హనుమకొండ నుండి వచ్చిన తుంగతుర్తి నరసింహారావు అనే వకీలు.

దాసుగారి తదనంతరం క్రమేణా ఆ సత్రం పాడుబడి, ఆస్తి ఇతరుల చేతుల్లోకి వెళ్లింది. కొన్నేండ్ల  క్రితం ఆ సత్రాన్ని శృంగేరిపీఠం ఆధీనంలోకి తీసుకుంది. చక్ర సిమెంట్స్ అధినేత కృష్ణమోహన్ సహకారంతో వేద పాఠశాలను పెట్టి మళ్లీ అన్నదానం చేస్తున్నారు. ఇప్పటికీ రామ గుండిగ, లక్ష్మణ గుండిగ పేరిట ఆ రెండు గుండిగలు ఇక్కడ ఉన్నాయి.

వనరాముడు

సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు సీతాదేవి కోసం దండకారణ్యమంతా కలియ తిరిగారు. సీతా వియోగంతో దుఃఖితుడైన రాముడిని లక్ష్మణుడు ఓదార్చిన ప్రాంతమిది. మాయలేడిగా వచ్చి సీతాపహరణానికి కారకుడైన మారీచుని రాముడు సంహరించిన ప్రాంతం కూడా ఇదే. ‘వృక్షే వృక్షే చపశ్యామి రామం కృష్ణాజీనాంబరం’ అని మారీచుడు అన్న రీతిగా దండకారణ్యమంతా, అరణ్యంలోని ప్రతీ చెట్టులో కూడా రాముడిని దర్శించిన ప్రాంతమిదే. ఇక్కడ రాముడిని వృక్షరూపంలో ఆరాధిస్తారు. కొన్ని వందల ఏళ్లకు ముందు ఇక్కడి రెండు పెద్ద పెద్ద టేకు

మద్ది చెట్లను ఆ ప్రాంత గిరిజనులు కొలిచేవారు. అటవీశాఖ చాలా కాలం క్రితమే వాటిని పురాతన వృక్షాలుగా గుర్తించి, ఆ రెండు చెట్లకు ‘రామలక్ష్మణ వృక్షాలు’ అని పేరు పెట్టింది. ఈ ప్రాంతాన్ని ‘వనరామ క్షేత్రం’గా  పిలుస్తుంటారు. ఈ ప్రాంతం రామయ్య క్షేత్రానికి తూర్పు ఆగ్నేయ దిశగా శబరి నది దాటగానే తీరాన ఉన్న వరరామచంద్రాపురానికి (ప్రస్తుతం ఆంధ్రాలో విలీనమైనది) 23 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వీఆర్​ పురం నుంచి జీడిగుప్పకు 15 కిలోమీటర్లు జీపుల్లో వెళ్లి అక్కడి నుంచి 8 కిలో మీటర్లు కాలినడకన రామలక్ష్మణుల వృక్షాల వద్దకు వెళ్లాలి. దట్టమైన అడవి మధ్యలో  ఆ రెండు చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. అంతటి చెట్లు ప్రస్తుతం ఏ అడవుల్లోనూ లేవట! ఇదే వనరాముడిగా పెద్దలు చూపిన వనరామక్షేత్రం.