22.5 శాతం పెరిగిన ఎల్​&టీ లాభం

22.5 శాతం పెరిగిన ఎల్​&టీ లాభం

క్యూ2లో రూ.2,229 కోట్లకు..

న్యూఢిల్లీ: లార్సెన్ & టూబ్రో (ఎల్​&టీ)కు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 22.5 శాతం పెరిగి రూ. 2,229 కోట్లకు చేరుకుంది. పోయిన ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 34,772 కోట్ల ఆదాయం రాగా,  ఇది ఈసారి 23 శాతం పెరిగి రూ.42,763  కోట్లకు చేరింది. ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌ల విభాగం ఊపందుకోవడం,  ఐటీ & టీఎస్​ పోర్ట్‌‌ఫోలియోలో స్థిరమైన వృద్ధి వల్ల అమ్మకాలు అంచనాల కంటే బాగున్నాయని కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి వర్కింగ్ క్యాపిటల్,  క్యాష్ ఫ్లో మేనేజ్‌‌మెంట్‌‌, రిసీవబుల్స్​ కలెక్షన్లపై కంపెనీ దృష్టి పెడుతుందని భావిస్తున్నారు. మార్కెటింగ్ బాగుండటం,  ట్రావెలింగ్‌‌ ఊపందుకోవడం వల్ల ఖర్చు కొంత పెరగడానికి దారితీసింది.  అంతర్జాతీయ ఇబ్బందుల వల్ల సప్లై చెయిన్​ సమస్యలు కొనసాగవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. 

ప్రస్తుత క్యూ2లో గ్రూప్ స్థాయిలో రూ. 51,914 కోట్ల విలువైన ఆర్డర్‌‌లను ఎల్‌‌అండ్‌‌ టీ సంపాదించుకుంది. అంతకుముందు సంవత్సరం ఇదే క్వార్టర్తో పోలిస్తే 23 శాతం వృద్ధిని సాధించింది. రిపోర్టింగ్ క్వార్టర్లో.. పబ్లిక్ స్పేస్‌‌లు, న్యూక్లియర్ పవర్, ఇరిగేషన్, ఫెర్రస్ మెటల్, హెల్త్, రెన్యూవబుల్స్,  రిఫైనరీ సెక్టార్‌‌లతో సహా పలు విభాగాల నుంచి ఆర్డర్లు అందాయని కంపెనీ తెలిపింది. ఈ క్వార్టర్లో మొత్తం ఆర్డర్ ఇన్‌‌ఫ్లోలో రూ.17,341 కోట్లు కాగా వీటిలో అంతర్జాతీయ ఆర్డర్లు  33 శాతం ఉన్నాయి. గ్రూప్  కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ విలువ ఈ సెప్టెంబర్ చివరి నాటికి రూ.3,72,381 కోట్లుగా ఉంది. వీటిలో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 28 శాతం ఉంది. ఈ సందర్భంగా ఎల్​&టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్​ఓ) శంకర్ రామన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో చాలా అస్థిరత ఉందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం,  కరెన్సీ విలువ  తగ్గడం,  కొన్ని దేశాల్లో ఇంధన కొరత  ఇందుకు కారణమని అన్నారు. దేశ మార్కెట్​ మాత్రం నిలకడగా ఉందని ఆయన వివరించారు.