
న్యూఢిల్లీ: లార్సెన్ & టూబ్రో (ఎల్&టీ) 2022–-23 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ. 2,553 కోట్ల (కన్సాలిడేటెడ్) నికర లాభాన్ని ప్రకటించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 24 శాతం పెరిగింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు భారీగా రావడం, ఐటీ&టీఎస్ పోర్ట్‌ఫోలియో పెరగడం ఇందుకు కారణాలని కంపెనీ తెలిపింది. తాజా క్వార్టర్లో ఆదాయం రూ. 46,390 కోట్లకు చేరుకుంది. పోయిన ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 17 శాతం అధికమని కంపెనీ తెలిపింది. తమ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు ఉన్నాయని ఎనలిస్టులు తెలిపారు.
ఇన్‌ఫ్రా, ఐటీ బూస్ట్
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల విభాగంలో మెరుగైన పనితీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ సర్వీసెస్ (ఐటీ అండ్ టీఎస్) పోర్ట్‌ఫోలియో బిజినెస్ ఊపందుకోవడం వల్ల డిసెంబరు క్వార్టర్లో ఫలితాలు బాగా వచ్చాయని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఆదాయం రూ. 17,317 కోట్ల వరకు వచ్చింది. ఇది కంపెనీ మొత్తం ఆదాయంలో 37 శాతంగా ఉందని కంపెనీ పేర్కొంది. గ్రూప్ స్థాయిలో, ఎల్&టీ ఈ క్వార్టర్లో రూ. 60,710 కోట్ల విలువైన ఆర్డర్‌లను అందుకుంది. పోయిన ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ క్వార్టర్ చివరి నాటికి కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ విలువ రూ.3.86 లక్షల కోట్లుగా ఉంది.
ఎనర్జీ ప్రాజెక్ట్స్ సెగ్మెంట్
తాజా క్వార్టర్లో ఎనర్జీ ప్రాజెక్ట్స్ సెగ్మెంట్ 12 శాతం వార్షిక వృద్ధితో రూ. 9,051 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందింది. డిసెంబరు చివరి నాటికి ఆర్డర్ బుక్ విలువ రూ. 72,000 కోట్లు. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ బుక్ వాటా 50 శాతంగా ఉందని ఎల్&టీ తెలిపింది. సెగ్మెంట్ ఇబిటా మార్జిన్ 8.3 శాతం నుంచి 8.7 శాతానికి మెరుగుపడింది. ఇదిలా ఉంటే హైటెక్ మాన్యుఫాక్చరింగ్ సెగ్మెంట్‌ఈ క్వార్టర్లో రూ. 1,931 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందింది. ఇవి వార్షికంగా 36 శాతం తగ్గాయి. డిఫెన్స్, ఇంజినీరింగ్ వ్యాపారంలో ఆర్డర్లు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. హైటెక్ మాన్యుఫాక్చరింగ్ ఆర్డర్ బుక్ రూ. 19,869 కోట్లు కాగా, ఇబిటా మార్జిన్ 19.9 శాతం నుంచి 17.5 శాతానికి పడిపోయింది.
ఐటీ & టెక్నాలజీ సర్వీసెస్ (ఐటీ&టీఎస్)
ఎల్&టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ మైండ్‌ట్రీ లిమిటెడ్‌తో తమ విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. క్వార్టర్లో కొత్త సంస్థగా పనిచేయడం ప్రారంభించాయి. ఈ విభాగం 25 శాతం వృద్ధితో రూ.10,517 కోట్ల కస్టమర్ ఆదాయాన్ని సాధించింది. సెగ్మెంట్ ఇబిటా మార్జిన్ 19.2 శాతంగా ఉంది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే క్వార్టర్లో 23.6 శాతంగా ఉంది. ఎల్టీమైండ్ట్రీలో వన్-టైమ్ విలీన ఇంటిగ్రేషన్ ఖర్చుల కారణంగా మార్జిన్ కొంత తగ్గిందని కంపెనీ తెలిపింది.