
- షాపు ఓనర్ల నిరసనకు వ్యతిరేకిస్తూ కదంతొక్కిన మరాఠీలు
- మీరా భయాందర్‌లో ఆందోళన
థానే: మహారాష్ట్రలో భాషా వివాదం ముదురుతున్నది. థానేలో జరిగిన ఘటనకు నిరసనగా రాజ్ థాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) పార్టీ మంగళవారం భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. షాపు ఓనర్లు ఇచ్చిన నిరసన పిలుపునకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు, మహారాష్ట్ర ఏకీకరణ సమితి, ఇతర సంస్థలు కదం తొక్కాయి.
థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో మరాఠీ ‘అస్మిత’(గర్వం) పేరుతో ఎంఎన్‌ఎస్, కొన్ని సామాజిక సంఘాలు నిర్వహించిన ఈ మోర్చాలో వందలాది మంది శివసేన (యూబీటీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ పోలీసులు నిరసన ప్రదర్శనకు అనుమతివ్వలేదు. పలువురు నేతలను అరెస్ట్ చేశారు. దీంతో వీధుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
స్థానిక నేత అరెస్ట్‌తో హైటెన్షన్
ఎంఎన్ఎస్ చేపట్టిన ర్యాలీని ప్రజా భద్రత, ట్రాఫిక్ అంతరాయం వంటి కారణాలతో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పలువురు మరాఠీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మహిళలను కూడా పోలీసులు లాక్కెళ్లి వ్యాన్ఎక్కించారు. స్థానిక నేత అవినాశ్ జాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ వీడియోలు అటు సోషల్‌మీడియాలో, ఇటు డిజిటల్మీడియాలో ప్రసారం అయ్యాయి. దీంతో మరాఠీ నేతలు, కార్యకర్తలు ఆందోళకు దిగారు. అక్కడికి వచ్చిన శివసేన మంత్రి పత్రాప్ సర్నాయక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, మరాఠీ ర్యాలీకి అనుమతివ్వలేదన్న కారణంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి ప్రతాప్ కూడా ఆందోళనకు దిగారు.
ప్రత్యామ్నాయ మార్గాన్ని తిరస్కరించారు: సీఎం
ఎంఎన్ఎస్ ర్యాలీ ఉద్రిక్తతపై ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమని, ఇక్కడ ఎవరైనా నిరసనలు తెలుపొచ్చని, ర్యాలీలు తీయొచ్చని తెలిపారు. అయితే, ప్రజా భద్రత, ట్రాఫిక్నియంత్రణకు అనుగుణంగా పోలీసులే వీటికి అనుమతి ఇస్తారని చెప్పారు. పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గంలో ర్యాలీకి అంగీకరించకపోవడంతో ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు చెప్పారు.