రూ.2 వేల నోట్ల మార్పిడికి..ఈ నెల 7 వరకు గడువు

రూ.2 వేల నోట్ల మార్పిడికి..ఈ నెల 7 వరకు గడువు

న్యూఢిల్లీ: రెండు వేల రూపాయల నోటును మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) తుది గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించింది.  రూ.2వేల నోట్లను వాపస్ చేయడానికి ముందుగా విధించిన గడువు శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే.  అక్టోబరు 8వ తేదీ నుంచి బ్యాంకు శాఖల్లో రూ.2వేల నోట్ల డిపాజిట్లను ఆపేస్తారు. తదనంతరం కూడా రూ.2వేల నోట్లు చట్టబద్ధంగా చెలామణి అవుతాయి. ఆ తరువాత వాటిని తమ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.  ఒక కస్టమర్‌‌‌‌‌‌‌‌ గరిష్టంగా రూ.20 వేల విలువైన నోట్లను ఆర్​బీఐ  కార్యాలయాల్లో  మార్చుకోవచ్చు.

వ్యక్తులు,  సంస్థలు 19 ఆర్​బీఐ ఆఫీసుల్లో ఇచ్చిన రూ.2వేల బ్యాంక్ నోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్​ అవుతాయి.  ఇండియా పోస్ట్ ద్వారా కూడా రూ.2వేల బ్యాంక్ నోట్లను ఆర్​బీఐకి పంపవచ్చు.  ఆర్​బీఐ  వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బును జమ చేస్తుంది. ఇలా మార్పిడి చేసుకోవడానికి కొన్ని రూల్స్​ ఉంటాయని, అవన్నీ పాటించాలని ఆర్​బీఐ తెలిపింది.  దేశంలోని19 ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ కార్యాలయాల్లో రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడికి సంబంధించిన సదుపాయం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.  ఆర్​బీఐ ప్రకటన ప్రకారం.. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.రెండు వేల బ్యాంకు నోట్లలో 96 శాతం తిరిగి వచ్చాయి. రూ.రెండు వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు మే 19, 2023న ఆర్​బీఐ ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న రూ. 3.56 లక్షల కోట్ల రూ. రెండువేల నోట్లలో, రూ. 3.42 లక్షల కోట్లు తిరిగి అందాయని, కేవలం రూ. 0.14 లక్షల కోట్లు మాత్రమే చెలామణిలో  ఉన్నాయి.