నల్గొండ అర్బన్, వెలుగు : దేశంలో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రూప్–1 పరీక్షకు సంబంధించిన జీవో 29 రద్దు చేసిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం నల్గొండలోని అంబేద్కర్ భవన్ లో జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో నిర్వహించనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులంతా బీసీ అభ్యర్థికే ఓటు వేసేలా ప్రజలను చైతన్యపరుస్తామన్నారు.
అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఉద్యోగుల సంఘం జేఏసీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ సభ్యులుగా కొంపెల్లి భిక్షపతి, నారాయణయాదవ్, సమీర్ కుమార్, కే.శంకర్ గౌడ్, వేముల శేఖర్, సిరందాసు రామదాస్, కృష్ణకాంత్, ఎస్ డీ అలీం, మండల ఆంజనేయులు, నాగయ్యను ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు జనార్దన్, కృష్ణయ్య, చంద్రం, సైదులు పాల్గొన్నారు.