ఒకే పనిని వేర్వేరుగా ప్రారంభించిన అధికార పార్టీ లీడర్లు

 ఒకే పనిని వేర్వేరుగా ప్రారంభించిన అధికార పార్టీ లీడర్లు

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పోటీపడాల్సిన లీడర్లు పూర్తిచేసిన వాటిని ప్రారంభించేందుకు పోటీ పడుతున్నారు. క్రెడిట్ అంతా తమకే దక్కాలనే ఆలోచనతో అధికార పార్టీ లీడర్లు ఒకే పనిని విడివిడిగా ప్రారంభించి నవ్వుల పాలవుతున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఉన్న విబేధాలు బయటపడుతున్నాయి. 

నియోజకవర్గంలో టీఆర్ఎస్​కు ఇద్దరు ముఖ్య నేతలు ఉండగా వారిలో ఒకరు ఉద్యమనేత, ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు, ఇంకొకరు ఎమ్మెల్యే వివేకానంద్. అయితే మొదట నుంచి ఇదే పార్టీలో ఉన్న శంభీపూర్​రాజు వర్గానికి, టీడీపీ నుంచి వచ్చిన వివేకానంద్​వర్గానికి మొదట నుంచి పొసగట్లేదు. ఆ దూరం పెరుగుతూ వస్తోంది. ఎమ్మెల్యే వివేకానంద్​ఏ కార్యక్రమం తలపెట్టినా 90 శాతం మంది లీడర్లు హాజరవుకావడం లేదు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్యక్రమాలకు మాత్రం తప్పకుండా వస్తున్నారు. ఇటీవల సుభాష్​నగర్ డివిజన్(130)లో రూ.కోటిపైగా నిధులతో రోడ్డు, పార్కులు అభివృద్ధి చేశారు. ఈ నెల 10వ తేదీన మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ భర్త సురేశ్​రెడ్డి పనులు పూర్తయిన వాటిని ప్రారంభించారు. కాగా వాటినే ఎమ్మెల్యే వివేకానంద్​ సోమవారం తన అనుచరులతో కలిసి ప్రారంభించారు. అధికార పార్టీ లీడర్లే ఎవరికివారు రెండుసార్లు ప్రారంభించడం ఏమిటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.