V6 News

విలువలకు మారుపేరు దుద్దిళ్ల శ్రీపాదరావు: మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

విలువలకు మారుపేరు దుద్దిళ్ల శ్రీపాదరావు: మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మంథని, వెలుగు: పేదవారి కళ్లల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్  విజయ రమణారావు, ఎమ్మెల్యే మక్కాన్  సింగ్  తెలిపారు. సోమవారం మంథని, ముత్తారం మండలాల్లో ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్​ శ్రీపాదరావు 27వ వర్ధంతిని నిర్వహించారు. శ్రీపాద కాలనీలో గోవిందుల రమేశ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీపాద రావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీపాద రావు రాజకీయాల్లో హుందాతనానికి, విలువలకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు ఇకపై శ్రీపాద రావు జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం చలివేంద్రంతో పాటు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ముత్తారం మండలంలో హైదరాబాద్​లోని పుష్పగిరి కంటి దవాఖాన ఆధ్వర్యంలో 1,536 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 491 మందిని ఉచిత శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. 717 మందికి మంత్రి శ్రీధర్ బాబు కంటి అద్దాలు పంపిణీ చేశారు.

అయిలి ప్రసాద్, వొద్నాల శ్రీనివాస్, చొప్పరి సదానందం, దొడ్డ బాలాజీ, కుమారస్వామి, అరెల్లి కిరణ్, చారి, శంకర్  పాల్గొన్నారు. ధర్మపురి(పెగడపల్లి): శ్రీపాదరావు 27వ వర్ధంతిని జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  క్యాంప్​ ఆఫీస్​లో నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. లైబ్రరీ చైర్మన్  సంగనభట్ల దినేశ్, ధర్మపురి మున్సిపల్  కౌన్సిలర్లు, కాంగ్రెస్  నాయకులు పాల్గొన్నారు.

కరీంనగర్ సిటీ: మాజీ స్పీకర్  స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు వర్ధంతిని కరీంనగర్​ కాంగ్రెస్​ ఆఫీస్​లో నిర్వహించారు.  శ్రీపాదరావు ఫొటోకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్, కార్పొరేషన్  కాంగ్రెస్  అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్  తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బస్టాండ్  చౌరస్తా వద్ద శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్  నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.