టికెట్ రానోళ్లు... ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూపు

టికెట్ రానోళ్లు... ఫార్వర్డ్ బ్లాక్  వైపు చూపు
  • ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ కోసం ప్రధాన పార్టీల నేతల యత్నం
  • సొంత పార్టీలో టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఫార్వర్డ్ బ్లాక్ టచ్ లోకి వెళ్తున్న లీడర్లు
  • గత ఎన్నికల్లో ఎమ్మెల్యే చందర్ గెలుపులో సింబల్ దే కీరోల్
  • మున్సిపల్ ఎన్నికల్లోనూ పదుల సంఖ్యలో సీట్లు గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్

కరీంనగర్, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలవాలనుకుంటున్న నేతలు.. ఒకవేళ టికెట్ రాకపోతే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలా అని ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడమా.. లేదంటే వేరే పార్టీ తరఫున బరిలోకి దిగడమా అనే ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు లీడర్లు టికెట్ల కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ జాబితాలో పేరు దక్కని పెద్దపల్లి, మానకొండూరు, చొప్పదండికి చెందిన కొందరు ఆశావహులు ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో మూడు నెలలే ఉండడం, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ప్రజల్లో గుర్తింపు ఉండదనే భయంతో కొందరు నేతలు ఇప్పటి నుంచే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ లాంటి పార్టీల వైపు  చూస్తున్నారు. 

రామగుండం, లోకల్ బాడీస్ ఎలక్షన్స్  ఎక్స్​పీరియన్స్​తోనే..  

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రాని కోరుకంటి చందర్ చివరి నిమిషంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి సింహం గుర్తుపై గెలిచారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ రామగుండంలో 13 డివిజన్లలో, కరీంనగర్ లో 3 డివిజన్లు, చొప్పదండిలో ఒక కౌన్సిలర్, 7 ఎంపీటీసీ స్థానాల్లో సింహం గుర్తుతోనే గెలుపొందారు.

చొప్పదండి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కూడా ఫార్వర్డ్ బ్లాక్ నుంచే గెలిచారు. గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో ఆయా పార్టీల్లో టికెట్లు దక్కని వారు సింహం గుర్తుపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకున్న ఇమేజ్‌‌‌‌తో ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 

కరీంనగర్ బరిలో జోజిరెడ్డి?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సారి అన్ని స్థానాలను అభ్యర్థులను బరిలో నిలపాలని ఆలిండియా ఫార్వర్డ్​బ్లాక్​పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా అంబటి జోజిరెడ్డిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.