ఎన్టీఆర్, ఏఎన్నార్, మోహన్‌బాబు లోకలా?

ఎన్టీఆర్, ఏఎన్నార్, మోహన్‌బాబు లోకలా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ‘మా’ ఎలక్షన్స్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ నటులు ప్రకాశ్‌రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, మంచు విష్ణు తమ ప్యానెల్స్‌తో పోటీకి సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అనే వార్తలు రావడంపై వివాదం రేగుతోంది. తాను నాన్ లోకల్ కాదని ప్రకాశ్‌రాజ్ అన్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తున్న వాళ్లెవరైనా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ప్రస్తుత ‘మా’ ప్యానెల్ అధ్యక్షుడు నరేశ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ వివాదం మీద టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ప్రకాశ్‌రాజ్‌ను స్థానికేతరుడని అంటే భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లేనని ఆర్జీవీ అన్నారు. 

‘మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్. మైఖేల్ జాన్సన్ నాన్ లోకల్. బ్రూస్‌ లీ నాన్‌ లోకల్. రాముడు, సీత కూడా నాన్ లోకల్. ప్రకాశ్‌రాజ్ కూడా నాన్ లోకల్. అతడి నటన చూసి నాలుగుసార్లు ఈ దేశం అతడ్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే మీరేమో నాన్ లోకల్ అంటున్నారు. ఈ కామెంట్ భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్నదని చెప్పాలి’ అని ఆర్జీవీ ఫైర్ అయ్యారు.

‘ముప్పై ఏళ్లుగా ప్రకాశ్‌రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని.. చలం పుస్తకాలని మళ్లీ తనే ముద్రించి, పెళ్లాం, పిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్లకు పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా? కర్ణాటక నుంచి ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా? ఎలా ? ఎలా ? ఎలా? కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకలైతే.. గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు.. బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా? ఎలా?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు.