
సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచే బాధ్యత లెక్చరర్లే తీసుకోవాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్ సింగ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లాలో వివిధ కాలేజీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో భారీగా అడ్మిషన్లు పెరిగాయన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 154 అడ్మిషన్లు అయ్యాయన్నారు. ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఇప్పటికే రాష్ట్రంలో 81 మందికి ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పించారన్నారు. ఈ నెల 31 వరకు టీసీలు తెప్పించాలని లెక్చరర్లను కోరారు. నిమికల్ ప్రిన్సిపల్ మారం హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుంగతుర్తి ప్రిన్సిపాల్ రాజమోహన్, లెక్చరర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.